జీహెచ్ఎంసీ ఎన్నికలకు స్టే ఇవ్వలేం, కానీ విచారణకు ఓకే, శ్రవణ్ పిటిషన్‌పై హైకోర్టు..
దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత .. తెలంగాణ ప్రజానీకం దృష్టి గ్రేటర్ ఎన్నికలపై పడింది. దుబ్బాకలో కారుకు పంక్చర్ కావడంతో.. బల్దియా బాద్ షా ఎవరనే చర్చకు దారితీసింది. అందుకు తగినట్టే బీజేపీ దూకుడుగా ముందుడుగు వేస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం కూడా తమకు తోచిన విధంగా అభ్యర్థుల వేట, ప్రచార బరిపై ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో కొందరు ఎన్నికలు/ రిజర్వేషన్ల పేరుతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రిజర్వేషన్ల అభ్యంతరాలపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీం తీర్పునకు విరుద్దంగా..
జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆపివేయాలని దాసోజు శ్రావణ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ చేపట్టలేదని వివరించారు. పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఎంబీసీల సమస్యపై గత పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదు అని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చే సమయంలో ఎందుకు గుర్తొచ్చిందని అడిగారు.

నోటీసులు జారీ..
రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి 2015, 2016 పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. కానీ అభ్యంతరాలపై విచారణ కొనసాగుతోందని స్పష్టంచేసింది. దీంతో స్టే ఇవ్వబోమని హైకోర్టు కరాఖండిగా చెప్పేసింది.

రె‘ఢీ’
బల్దియా ఎన్నికలకు సంబంధించి ఒకటి రెండురోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో శ్రావణ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణను అడ్డుకోబోమని హైకోర్టు చెప్పినప్పటికీ.. విచారణ పేరుతో సమయం పొడగించే అవకాశం లేకపోలేదు. మరోవైపు బల్దియా పోరు కోసం టీఆర్ఎస్- బీజేపీ- కాంగ్రెస్ తమ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోవడంతో.. బల్దియాలో గెలవాలనే కసితో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది.