తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు: నినాదాల హోరులో ‘భాగ్యనగర్’ అంటూ ప్రధాని మోడీ
హైదరాబాద్: తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ భారీ బహిరంగలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. మొదట ఆయన తెలుగులోనే కాసేపు మాట్లాడారు. భాగ్య లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఇక్కడికి వచ్చినట్లు కనిపిస్తోందన్నారు.


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీజేపీ: ప్రధాని మోడీ
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ నడుచుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ధైర్యసాహసాలు, కళలు, సాంస్కృతికి తెలంగాణ రాష్ట్రం సూర్తిదాయమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు.

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఖాయమన్న మోడీ
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ తెలంగాణకు సహకరించామని, ఉచిత రేషన్, వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇప్పటికే ఘన విజయం సాధించామన్నారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు బీజేపీతోనే ఉన్నారంటూ ప్రధాని మోడీ
2019లో తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. 2019 నుంచి తెలంగాణలో బీజేపీ బలపడుతూనే వస్తుందన్నారు. ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి లక్షలాదిగా హాజరైన అభిమానులు మోడీ మోడీ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారందరికీ ప్రధాని మోడీ మరోసారి ధన్వవాదాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పెద్ద పాత్ర పోషిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

తెలంగాణ అభివృద్ధి కేంద్రం పాత్ర పెద్దదేనంటూ మోడీ
రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించామని ప్రధాని మోడీ తెలిపారు. దీంతో దేశంలో ఎరువుల కొరత తీరుతుందన్నారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్ కూడా కేటాయించాం. హైదరాబాద్ లో సైన్స్ సిటీ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలుగులో సైన్స్ టెక్నాలజీ చదువులుంటే ఎంత బాగుంటుందన్నారు. రైతుల కోసం ఎంఎస్పీని పెంచామన్నారు. తెలంగాణలో 5వేల జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో రూ. 1500 కోట్లతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. దేశ ఆత్మనిర్భర్, ఆత్మ విశ్వాసానికి హైదరాబాద్ కేంద్రమని ప్రధాని మోడీ అన్నారు.

విమర్శల ప్రస్తావన లేకుండానే ప్రధాని మోడీ ప్రసంగం, కానీ
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని, అభివృద్ధి మరింత వేగం ఖావడం కూడా ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాగా, టీఆర్ఎస్ రాజకీయ విమర్శలు, కేసీఆర్, టీఆర్ఎస్ గురించి తన ప్రసంగంలో ప్రస్తావన కూడా చేయలేదు ప్రధాని మోడీ. అయితే, తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ఆయన వివరించారు. తెలంగాణలోని ప్రతి మూలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వెళ్లాయన్నారు. కాగా, మోడీ తన ప్రసంగంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కాకతీయుల ధైర్యసాహసాలను ప్రస్తావించారు. మోడీ ప్రసంగిస్తున్నంత సేపు మోడీ మోడీ అంటూ నినాదాలు హోరెత్తాయి.
హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ ప్రస్తావించిన ప్రధాని మోడీ
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ప్రారంభంలో హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్ అంటూ ప్రస్తావించారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ ఈ విధంగా ఉచ్ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా మార్పు తథ్యమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.