దుబ్బాక గెలుపు: బండి సంజయ్‌కి అమిత్ షా అభినందనలు, ఇంకా ఏమన్నారంటే..?
న్యూఢిల్లీ/హైదరాబాద్: దుబాక ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించడంపై ఆ పార్టీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం.
'దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో విజయం సాధించడానికి కృషి చేసిన
తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి శుభాభినందనలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవటంలో,మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది' అని అమిత్ షా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అలాగే, బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏను గెలిపించిన ఆ రాష్ట్ర ప్రజలకు, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఉప ఎన్నికల ఫలితాల్లో విజయాలు నమోదు చేసిన గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్ ప్రజలకు కూడా అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
కాగా, దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1079 ఓట్ల మెజార్టీతో విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.