రేపు సాయంత్రం 6గంటల వరకే ఎన్నికల ప్రచారం .. డెడ్ లైన్ చెప్పిన ఈసీ .. పీక్స్ కి చేరిన ప్రచారాలు
గ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించే వారిపై, ప్రలోభాలకు గురి చేసే వారి పై కేసులు పెడతామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
గ్రేటర్ వార్ .. పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్లు .. ఆపాలని పవన్ ఫ్యాన్స్ వార్నింగ్

ఈసీ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
జిహెచ్ఎంసి యాక్ట్ 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఆయన పేర్కొన్నారు. రేపు సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నియమాలను పాటించాలని, ఆపై పోలింగ్ అయ్యేంతవరకూ, ఫలితాలు వచ్చేంతవరకూ కూడా ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.
ఇక ఆదివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగించాల్సిన నేపథ్యంలో, మరింత జోరుగా ప్రచార పర్వం కొనసాగుతోంది.

పతాక స్థాయికి చేరిన ప్రచార హోరు
ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది . హోరాహోరీగా ప్రచార పర్వం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల తూటాలను పేలుస్తున్నారు. బిజెపి కోసం జాతీయ నాయకులు రంగంలోకి దిగి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా జాతీయ నేతలు సైతం ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఒక టిఆర్ఎస్ పార్టీ బిజెపి దూకుడును నిలువరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేస్తున్నా , కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఈ ఎన్నికలపై అంతగా దృష్టి పెట్టలేదు .

సీఎం కేసీఆర్ బహిరంగ సభ .. బీజేపీ జాతీయ నాయకుల ప్రచారం
నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ రోజు బిజెపి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తోంది. రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారని సమాచారం . జాతీయ స్థాయి నాయకుల హోరాహోరీ ప్రచారంతో గ్రేటర్ లో ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరుకుంది . ప్రధాన పార్టీల నుండి హేమాహేమీలు గ్రేటర్ ఓటర్ల మనసును గెలుచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

కొనసాగుతున్న ప్రలోభాలు .. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ?
ప్రచార పర్వం తోపాటుగా జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతోందని సమాచారం. ఇప్పటికే అపార్ట్మెంట్ కమిటీలు, కుల సంఘాలు, కాలనీ కమిటీ లు, యువజన సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్ ను తమ వైపు తిప్పుకోవాలని ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు . ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో, ఏ పార్టీకి ఝలక్ ఇస్తారో వేచి చూడాల్సిందే.