హైదరాబాద్‌లో ఇంజనీర్‌గా పనిచేసి.. చివరికి బిచ్చగాడిగా మారాడు.. ఇదీ శంకర్ జీవితగాథ
అదేదో సినిమాలాగా తల్లికోసం బిక్షమెత్తుకున్న బాపతు కాదితను.. వ్యవస్థపై పట్టరాని కోపంతో నిజంగానే బిచ్చగాడిలా మారాడు. ఒకప్పుడు హైదరాబాద్ లో దర్జాగా ఇంజనీర్ ఉద్యోగం చేసిన ఆ వ్యక్తి.. ఇప్పుడు ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం మెట్లమీద అడుక్కుతింటూ బతుకీడుస్తున్నాడు. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఇతని జీవితగాథకు సంబంధించిన వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

షాక్ తిన్న పోలీసులు..
గత శుక్రవారం జరిగిన ఓ చిన్న సంఘటనతో ఈ ఇంజనీర్ బిచ్చగాడి కథ వెలుగులోకి వచ్చింది. పూరీ ఆయలం ముందు ఓ రిక్షావాలాతో రక్తాలు కారేలా దెబ్బలాడిన బిచ్చగాణ్ని పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఫిర్యాదు రాయడానికి రిక్షావాలా తటపటాయిస్తుంటే.. బిచ్చగాడు మాత్రం అక్షరం పొల్లుపోకుండా చకచకా ఇంగ్లీష్ కంప్లైంట్ రాసిచ్చాడు. దాన్ని చూసి పోలీసులు షాక్ తిన్నారు. వివరాలు ఆరా తీయగా.. అతని పేరు గిరిజా శంకర్ మిశ్రా అని, ఇంజనీరింగ్ చదివాడని, గతంలో ఉద్యోగం కూడా చేశాడని వెల్లడైంది.

ఎక్కడివాడు..?
చదవడానికి సినిమా కథను తలపించే ఇంజనీర్ బిచ్చగాడి స్టోరీని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారాడు. ఆశ్రమంలో ఉంటూ కష్టపడి చదివాడు. మొదట బీఎస్పీ పూర్తిచేసి, కొంతకాలం ముంబైలో ఉద్యోగం చేసిన తర్వాత సీపెట్ నుంచి ప్లాస్టిక్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిప్లొమా చదివాడు. హైదరాబాద్‌లోని మిల్టన్ కంపెనీలో కొంతకాలంపాటు ఇంజనీర్‌గానూ పనిచేశాడు.

ఎందుకిలా మారాడు?
ఇంజనీరింగ్ చదవి, ఇంగ్లీష్ ఇంత బాగా రాయగలిగిన శంకర్ మిశ్రా అన్నీ వదిలేసి బిచ్చగాడిగా మారిపోడానికి దారితీసిన కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ లో పనిచేసిన టైమ్ లో తన పై అధికరులతో విభేదాలుండేవని, రానురానూ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం కోల్పోయి బిచ్చగాడిలా ఉండటానికే నిర్ణయించుకున్నానని శంకర్ తెలిపారు. నా అనేవాళ్లెవరూ లేకపోవడం కూడా ఆయనిలా మారడానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

చివరికి ఏం జరిగిందంటే..
ఏ కొట్లాట కారణంగా శంకర్ మిశ్రా గురించి పోలీసులకు, ప్రపంచానికి తెలిసిందో.. ఆ ఘటనపై కేసు నమోదు కాకుండానే అతను విడుదలయ్యాడు. శంకర్ గురించిన కథనాల్ని మీడియాలో చూసిన తర్వాత కొన్ని ఎన్జీవోలు అతణ్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిన్నప్పుడు కష్టపడి చదివిన అలవాటుతో అతను ఇప్పటికీ స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని పేపర్లు, పుస్తకాలు చదువుతుంటాడని స్థానికులు తెలిపారు.