• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సార్ గాంధీకి రండి... బిగ్ డ్యామేజ్.. కేసీఆర్ మేలుకోకపోతే అంతే సంగతి..

|

కొద్దిరోజుల క్రితం నాటికి,ఇప్పటికీ తెలంగాణలో చాలా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎప్పుడెప్పుడు టీవీలో చూద్దామా అని జనం ఆతృతగా ఎదురుచూశారు. ఆయన టీవీ తెర మీద కనిపించి మాట్లాడుతుంటే.. కాస్త భరోసాగా ఫీలయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్లకు అటు టీవీల్లోనూ,ఇటు యూట్యూబ్‌లోనూ బ్రహ్మాండమైన రేటింగ్ వచ్చింది. జాతీయ మీడియా కూడా ఆయన్ను తెలంగాణ స్టార్ అంటూ కొనియాడింది. బహుశా దేశంలో ఏ సీఎం ప్రెస్ మీట్‌కు ఇంత రేటింగ్ ఉండకపోవచ్చునని చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసుల తీవ్రత పెరిగింది,మరణాల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క కోవిడ్ 19 ఆస్పత్రి గాంధీలో సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి జూడాలు కూడా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. జనం అప్పటి లాగే ఇప్పుడు కూడా కేసీఆర్ నుంచి ఒక స్పష్టత కావాలని కోరుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.

సార్ గాంధీకి రండి...

సార్ గాంధీకి రండి...

తెలంగాణలో గాంధీ ఆస్పత్రి వివాదం పెరిగి పెద్దదవుతోంది. జూనియర్ డాక్టర్లు చేస్తున్న ధర్నా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు డిమాండ్లకు ఇప్పటివరకూ ఎలాంటి హామీ లభించకపోవడంతో జూడాలు ధర్నాను కొనసాగిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రికి కరోనా పేషెంట్ల తాకిడి పెరుగుతుంటే.. విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు రోడ్డు పైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. 'సార్ గాంధీకి రండి..','రాష్ట్రానికి ఒక్క సీఎం చాలు.. కానీ ఒక్క ఆస్పత్రి సరిపోదు..' వంటి ప్లకార్డులతో వారు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాలో పాల్గొంటున్న వైద్యులతో ఓ ప్రముఖ జాతీయ మీడియా మాట్లాడింది. ఈ సందర్భంగా రవిచంద్ర అనే హౌస్ సర్జన్ మాట్లాడుతూ.. 'మూడు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ గాంధీ ఆస్పత్రిలో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. మాకు రక్షణ అవసరం. మేము పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడం గురించి ఆలోచించాలా.. లేక మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలని ఆలోచిస్తూ కూర్చోవాలా..' అని ప్రశ్నించారు.

డీసెంట్రలైజ్ చేయాలన్న డిమాండ్..

డీసెంట్రలైజ్ చేయాలన్న డిమాండ్..

'ప్రభుత్వ యంత్రాంగం కరోనా కేసులపై కేవలం స్టేట్‌మెంట్స్ మాత్రమే ఇవ్వగలదు. కానీ ప్రత్యక్షంగా కరోనాతో పోరాడుతున్నది మేము. ప్రతీరోజూ 12 గంటలు పీపీఈ సూట్ ధరించి ట్రీట్‌మెంట్ అందించడం మామూలు విషయం కాదు. రాష్ట్రంలో మరో 6 మెడికల్ కాలేజీలు,30 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గాంధీ పైనే ఒత్తిడి పెంచకుండా డీసెంట్రలైజేషన్ చేపట్టండి.నిజానికి ప్రభుత్వం ఇప్పటివరకూ వైద్యులతో సంప్రదించి.. ఎలా ముందుకెళ్లాలని చర్చించింది లేదు. కేవలం మాకు డ్యూటీలు వేయడం తప్పితే.. మా నుంచి ఎటువంటి సలహాలు,సూచనలు స్వీకరించట్లేదు.' అని రవిచంద్ర చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం గాంధీలో 40 మంది పీజీ వైద్యులే..

ప్రస్తుతం గాంధీలో 40 మంది పీజీ వైద్యులే..

గాంధీకి చెందిన మరో జూనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. 'ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ టెస్టులు చేయాలి. కానీ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్ మాకు సహకరించట్లేదు. గాంధీలో ఏఎంసీ,ఐసీయూల్లో 120 మంది పీజీ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీజీ పరీక్షల కారణంగా 40 మంది వెళ్లిపోయారు. మరో 40 మంది క్వారెంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం కేవలం 40 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది. వైద్యులే కాదు ఇతరత్రా సిబ్బంది కొరత కూడా ఉంది. కాబట్టి వెంటనే స్టాఫ్‌ని పెంచాలి. ఇలాంటి సమయంలో వైద్యులకు సహకరించకుండా.. మానసిక స్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తే సమాజానికి అది చాలా నష్టం చేస్తుంది.' అని పేర్కొన్నారు.

120 పేషెంట్లకు 8 మంది వైద్యులు..

120 పేషెంట్లకు 8 మంది వైద్యులు..

రెండు నెలల క్రితం గాంధీ వైద్యులపై కరోనా పేషెంట్ బంధువులు దాడి చేసినప్పుడు.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని మరో జూనియర్ డాక్టర్ ప్రియా గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకూ ఆ చర్యలేవీ తీసుకోలేదన్నారు. దాడి జరిగిన ఒకటి,రెండు రోజులు దానిపై మాట్లాడటం.. ఆపై పట్టించుకోకపోవడం కామన్‌గా మారిపోయిందన్నారు. తమకు ఇళ్లు,కుటుంబాలు ఉన్నాయని.. గాంధీలో 14,16గంటల పాటు డ్యూటీలు చేయలేమని అన్నారు. 'ఐసీయూలోని 120 పేషెంట్లకు కేవలం 8 మంది వైద్యులే ఉన్నాం. ఒకవేళ పేషెంట్‌ను క్రిటికల్ కేర్ యూనిట్‌కి తరలించాలంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం వెతికేందుకే కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. ఇలా అయితే ఎలా డీల్ చేయగలం. కాబట్టి ప్రభుత్వం జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా ట్రీట్‌మెంట్ అందించాలి.' అని పేర్కొన్నారు.

మరో వైద్యుడు మాట్లాడుతూ... 'కరోనా ప్రబలిన కొత్తలో అంటే ప్రభుత్వం వేగంగా స్పందించలేకపోతుంది అని సర్ది చెప్పుకునేవాళ్లం. కానీ 4 నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం మెడికల్ పరంగా అవసరమైన స్థాయిలో చర్యలు చేపట్టకపోవడం విచారకరం.' అన్నారు. అంతేకాదు,సరిపోయేంత మంది డాక్టర్లు లేకుండా ఆస్పత్రిలో పడకలను పెంచుకుంటూ పోయి పేషెంట్లను చేర్చుకోవడం.. వారిని మృత్యువు ఒడిలోకి నెట్టడమేనని వ్యాఖ్యానించడం గమనార్హం. గాంధీ సూపరింటెండ్ రాజారావు మాత్రం వైద్యులపై ఒత్తిడి పెరుగుతోందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదన్నారు.

ఆందోళన రేపుతున్న పరిణామాలు..

ఆందోళన రేపుతున్న పరిణామాలు..

గాంధీ ఆస్పత్రిలో సేవలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు,ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల లీకైన కొన్ని ఆడియో టేపులు గాంధీలో అసలు పేషెంట్లను పట్టించుకోవడం లేదన్న ఆందోళనను పెంచాయి. ఓ వైద్య విద్యార్థి నిరసనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. గాంధీపై తీవ్ర ఒత్తిడి ఉందని,ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని అందులో ఆమె డిమాండ్ చేశారు. నిజానికి గచ్చిబౌలిలో టిమ్స్ పేరుతో ప్రభుత్వం మరో కరోనా ఆస్పత్రిని సిద్దం చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ దాన్ని అలంకారప్రాయంగానే ఎందుకు ఉంచిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అసలు గాంధీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బయలుదేరాలనుకోగా.. ఆయన్ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

  #RevanthReddy : Telangana Police Stopped Revanth Reddy @ His Home
  మేలుకోకపోతే బిగ్ డ్యామేజ్..!!

  మేలుకోకపోతే బిగ్ డ్యామేజ్..!!

  గాంధీ ఆస్ప్రత్రి వివాదంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దీనిపై మీడియా ముందుకు వచ్చి నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయట్లేదు.దీంతో ప్రభుత్వం చేతులెత్తేసిందా అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే టెస్టుల సంఖ్యలో దేశంలోనే చివరి వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు ట్రీట్‌మెంట్ విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం కొత్త డాక్టర్ల రిక్రూట్‌మెంట్ చేపడుతామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ ఒక్క గాంధీ ఆస్పత్రి పైనే ఆధారపడటం,టెస్టుల సంఖ్య పెంచకపోవడం,డాక్టర్ల రిక్రూట్‌మెంట్ చేపట్టకపోవడం.. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేవిగా మారాయి. ప్రభుత్వం దీనిపై త్వరగా మేలుకోకపోతే ఇటు ప్రజలకు,అటు ప్రభుత్వానికి బిగ్ డ్యామేజ్ తప్పదేమో..!!

  English summary
  Gandhi hospital doctors who staged protest against the attack demanding CM KCR to visit hospital to know the actual situations.They are demanding decentralise covid 19 hospitals to less the burden on Gandhi hospital
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more