టీఆర్ఎస్ బలాన్ని సగానికి కోసేసిన బీజేపీ: 4-50, ఎంఐఎంకూ షాకిచ్చిన కాషాయ పార్టీ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం దక్కించుకోకపోయినప్పటికీ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం గట్టి పోటీనిచ్చింది. ఇక ఎంఐఎం పార్టీ పాతబస్తీలో మరోసారి తన పట్టును నిలుపుకుంది. అయితే, బీజేపీ మాత్రం గత జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పుంజుకోవడం గమనార్హం.

దుబ్బాక జోష్.. జీహెచ్ఎంసీలోనూ..
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈసారి మాత్రం సత్తా చాటింది. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయోత్సాహాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కొనసాగించింది. అధికార టీఆర్ఎస్, మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారంలో జోరును చూపించింది. రాష్ట్ర నేతలతోపాటు బీజేపీ జాతీయ నేతలు కూడా ప్రచారం నిర్వహించడం ఆ పార్టీకి కొంత కలిసివచ్చిందనే చెప్పాలి.

నాలుగు నుంచి 50కి పెరిగిన బీజేపీ బలం..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి నువ్వానేనా అన్నట్లుగా బీజేపీ పోటీనిచ్చింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా 50 స్థానాలను తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. అంటే అదనంగా 46 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. టీఆర్ఎస్ స్థానాలకు బీజేపీ భారీగా గండికొట్టింది.

సగం టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లలో జెండా పాతిన బీజేపీ
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 99 స్థానాలు రాగా, ఈసారి మాత్రం ఆ పార్టీ 56 స్థానాలకే పరిమితమైంది. వంద స్థానాలకుపైగా సాధిస్తామని చెప్పినా.. గతంలో గెలిచినన్నీ స్థానాలు కూడా రాకపోవడం గమనార్హం. తాజా ఎన్నికల్లో 43 స్థానాల వరకు కోల్పోయింది టీఆర్ఎస్. అయితే, ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీనే జెండా ఎగురవేయడం గమనార్హం. ఒక స్థానం మినహా బీజేపీ గెలిచినవన్నీ టీఆర్ఎస్ పార్టీవే. గతంలో జాంబాంగ్ ఎంఐఎం ఖాతాలో ఉండగా.. ఇప్పుడు అది కాస్త బీజేపీ కైవసం చేసుకుంది.

టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ భారీ షాక్..
ఇక ఎంఐఎం 44 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ మాత్రం 50 స్థానాలు దక్కించుకోవడం ఆ పార్టీ ఏ మేర పుంజుకుందో చెప్పవచ్చు. 54 స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్కు ఇప్పుడు మేయర్ పీఠం దక్కాలంటే ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కీలకంగా మారింది. ఈ విధంగా బీజేపీ ఓ రకంగా విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 150 స్థానాలున్న జీహెచ్ఎంసీలో మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 76 స్థానాల్లో విజయం సాధించి ఉండాలి. కానీ, ఇప్పుడు ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయాయి. అయితే, టీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీసియో సభ్యుల మద్దతు తీసుకుని మేయర్ పీఠం దక్కించుకోనుంది. లేదంటే ఎంఐఎం మద్దతైనా కోరాల్సి వస్తుంది.