అలా చేస్తే ఓటింగ్ పెరిగే ఛాన్స్... గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌పై సీపీ సజ్జనార్...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడం బాధాకరమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. చాలామంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాసక్తత కనబర్చడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటు హక్కుపై ఎన్నికల కమిషన్ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కుకు ప్రభుత్వ పథకాలకు లింకు పెడితే ఓటింగ్ శాతం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు సీట్లు పొందాలన్నా, ఏదైనా సర్టిఫికెట్ తీసుకోవాలన్నా కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలన్నారు. ఓటు వేసిన వ్యక్తులకే ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలని... అలాగే ఓటేయని వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ దారుణంగా పడిపోయింది. 40శాతం ఓటింగ్ కూడా నమోదైందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 3గంటల వరకు కూడా కేవలం 25.34శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక చివరి 3 గంటల్లో పోలింగ్ కొద్దో గొప్పో పుంజుకున్నా మొత్తంగా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువే నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంత బద్దకంగా వ్యవహరించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓటింగ్ తగ్గడానికి గల కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లోక్‌సత్తా మాజీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. విదేశాల్లో నగర పాలనకు,మేయర్లకు చాలా ప్రాముఖ్యత,విలువ ఉంటుందన్నారు. అలాంటి వ్యవస్థ భారత్‌లోనూ రూపుదిద్దుకోవాలన్నారు.
రాజకీయ పార్టీల ఎజెండాలకు,ప్రజల ఎజెండాలకు బారీ గ్యాప్ ఉండటం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చునని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. అలాగే ఏదైనా ఒక పార్టీని గెలిపించాలన్న బలమైన కోరిక గానీ,ఒక పార్టీని ఓడించాలన్న బలమైన కోరిక గానీ లేకపోవడం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చునని అన్నారు. ఓటర్లలో నిరాసక్తత,వర్క్ ఫ్రమ్ హోమ్,వరుస సెలవులు,కరోనా భయం,విద్వేషపూరిత వ్యాఖ్యలు,ముందస్తు ఎన్నికలు తదితర కారణాలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమై ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.