పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక...
దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు ప్రకటించింది.దసరా,దీపావళి వేళ ప్రజల సంతోషం కోరి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.శనివారం(నవంబర్ 14) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ,మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కోవిడ్ 19పై పోరులో ముందుండి పోరాడిన యోధులకు ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. 2020లో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని.. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణలో తెలంగాణ పనితీరును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అభినందించారని గుర్తుచేశారు. పారిశుద్ద్య కార్మికులతో పాటు గృహ యజమానులకు కూడా మంత్రి కేటీఆర్ దీపావళి కానుక ప్రకటించారు.

రాష్ట్ర ప్రజలకు పండుగ కానుకగా ఆస్తి పన్నులో మినహాయింపును ప్రకటించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో.. ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీపావళి కానుకగా... జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 సంవత్సరానికి రూ.15వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మిగతా అన్ని పట్టణాల్లో రూ.10వేల వరకు ఆస్తి పన్ను చెల్లించేవారికి 50శాతం రాయితీ ఉంటుందన్నారు. తద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలకు, మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షల కుటుంబాలకు, తెలంగాణవ్యాప్తంగా మొత్తం 31.40 లక్షల కుటుంబాలకు రూ.326.48కోట్లు మేర లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,75,871 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున వరద సాయం అందించామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.475కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద సాయం అందనివారికి ఆందోళన అక్కర్లేదని.. మరో అవకాశం కల్పిస్తామని చెప్పారు. సాయం అందనివారు మీ సేవలో పేర్లు,ఇంటి చిరునామా,ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద సాయం అందిస్తారని చెప్పారు. బాధిత కుటుంబాలు బ్యాంకు ఖాతా నంబర్ ఇస్తే... నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందన్నారు. అవసరమైతే మరో రూ.100 కోట్లు ఇందుకోసం ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడబోదన్నారు.