రైతులపై పగ.. అందుకే వరి కొనడం లేదు.. షర్మిల ఫైర్
సమయం దొరికితే చాలు.. సీఎం కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ నిరాహార దీక్ష కూడా చేయడం లేదు. కానీ ప్రభుత్వం చేసే తప్పులను మాత్రం ఎత్తి చూపుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు.
వరి కొనకుండా రైతు మీద సర్కారు పగబట్టిందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొంటారో కొనరో తెలియక రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేసిందని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ధాన్యం కొనక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతన్నలు చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెడుతున్నారని తెలిపారు. దొరా.. నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా... నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అని షర్మిల హెచ్చరించారు.

ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు.. తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవా ? అని ఇంతకుముందు షర్మిల నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే, మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ... కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదు. కొనేది లేదని నిప్పులు చెరిగారు. అకాల వర్షాలకు పండిన పంట తడిసిపోయి మొలకలస్తుంటే, కష్ట పడి పండించిన పంట కండ్ల ముందు కొట్టుకుపోతుంటే, మొలకలొచ్చిన నారు వేసుకోవాలో పారబోసుకోవాలో కొంటారో కొనరో తెలియక" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే..? లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. ఇంకో 80 వేలు మళ్లీ ఇచ్చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం లక్ష 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలకు కూడా కేంద్రమే ఆలస్యం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నాడు.