ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీ .. గ్రేటర్ పోలింగ్ తగ్గటానికి చలి , కరోనా కారణాలన్న ఎస్ఈసి
జిహెచ్ఎంసి ఎన్నికల కోసం గ్రేటర్ హైదరాబాద్లో ప్రచారాలు బీభత్సంగా సాగినా ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు తీసుకు రావడంలో మాత్రం రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం ఫెయిల్ అయ్యాయి . చాలా దారుణంగా గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 25.34 శాతం పోలింగ్ నమోదైంది అంటే ఎంత తక్కువగా పోలింగ్ శాతం నమోదు అయిందో అర్థం చేసుకోవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా అందరూ విద్యావంతులు అయినప్పటికీ, ఎన్నికల పై ఆసక్తి చూపించకపోవడం ప్రధానంగా గుర్తించాల్సిన అంశం.
గ్రేటర్ వార్ .. కూకట్ పల్లిలోఉద్రిక్తత .. మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి

ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీ
పెద్దగా చదువుకోని గ్రామాలలో కూడా ప్రజలలో ఓటుహక్కు వినియోగించుకోవాలని చైతన్యం ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ వాసులలో మాత్రం ఆ చైతన్య లేకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పోలింగ్ డే గ్రేటర్ వాసులకు హాలిడే గా మారింది. దారుణంగా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఉంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి . పోలింగ్ విషయానికి వస్తే చాలా వరకు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం ఎదురు చూస్తున్నారు . జూబ్లీ హిల్స్ , బంజారా హిల్స్ ,మాదాపూర్, పాతబస్తీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

పోలింగ్ శాతం పెంచటంలో రాజకీయ పార్టీలు , అధికారులు ఫెయిల్
చాలా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ఓటర్లు లేక నిద్రపోతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఇప్పటివరకూ ఓటర్లే రాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి సారి తక్కువ ఓటింగ్ నమోదు అవుతుంది కానీ ఈసారి రాజకీయ పార్టీల ప్రచార హోరు చూసి ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందని అందరూ భావించారు. ఇక అధికారులు కూడా పోలింగ్ శాతం పెంచడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఓటర్లను మాత్రం పోలింగ్ బూతుల వైపు తీసుకురాలేకపోయారు.

జాతీయ స్థాయిలో ఆసక్తి ఉన్న ఎన్నికల పోలింగ్ ఇలాగేనా ?
పోలింగ్ శాతం పెంచటంలో రాజకీయ పార్టీలు, అధికారులు ఫెయిల్ అవ్వటం ఈ ఎన్నికల్లోనూ కనిపించింది. ఒకపక్క జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేసినా, జీహెచ్ఎంసీ ఎన్నికలపై జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగినా గ్రేటర్ వాసులు మాత్రం అదంతా మాకు సంబంధం లేదు అన్నట్టే ఉన్నారు . ఈ ఓటింగ్ భాగ్యనగరానికి సిగ్గుచేటని అందరూ భావిస్తున్నారు
. ముఖ్యంగా అతి తక్కువగా నమోదైన ఈ పోలింగ్ ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది అన్న టెన్షన్ కూడా రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది.

చలి, కరోనా పోలింగ్ తగ్గటానికి కారణాలన్న ఎస్ఈసి
ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని చెప్పారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. కరోనా కారణంగా కొంత ఓటింగ్ తగ్గిందని చెప్పిన పార్థసారథి, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ లేదు కాబట్టి మధ్యాహ్నం 12 గంటల లోపే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లని , ఇప్పుడు ఒక వైపు చలి, మరోవైపు కరోనా కారణంగా పోలింగ్ తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
శాంతి భద్రతల విషయంలో వాస్తవం కంటే రూమర్స్ ఎక్కువగా ఉన్నాయని, చిన్న చిన్న గొడవలు మినహాయించి ఎక్కడ ఏమి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదని పోలీసులు అందరూ అలెర్ట్ గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.