మాటలు జాగ్రత్త .. మాణిక్కం ఠాగూర్ కు కవిత వార్నింగ్ .. సోషల్ మీడియాలో గ్రేటర్ వార్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు తలదన్నేలా గ్రేటర్ ఎన్నికలలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ గ్రేటర్ పై జెండా ఎగరవేయ్యాలని తాపత్రయపడుతున్నాయి . జిహెచ్ఎంసి ఎన్నికల వేళ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి రంగంలోకి దిగిన కవిత కూడా పదునైన వాగ్బాణాలను సంధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల వేళ ... మీ సేవా కేంద్రాల వద్ద జనజాతర .. కారణం ఇదే !!

సోషల్ మీడియా లో ప్రత్యర్ధులపై ఎటాక్ చేస్తున్న కవిత
దుబ్బాకలో విజయం సాధించిన బిజెపి, జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న గులాబీ బాస్ ఇప్పటికే పార్టీ కీలక నేతలను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన కవిత కూడా గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ లను గెలిపించే బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటించటమే కాకుండా కవిత సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్
తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ తాజాగా సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన ఆయన అమిత్ షా అవసరమైనప్పుడల్లా కెసిఆర్ మద్దతిస్తారని, రాజ్యసభలో మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం అంటున్నారని, కేంద్రానికి కెసిఆర్ ఏటీఎం లాంటివాడు అంటూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ నేతకు ప్రశ్నాస్త్రాలు సంధించిన కవిత
ఈ ట్వీట్ పై స్పందించిన కవిత మాటలు జాగ్రత్త అంటూ కౌంటర్ ఇచ్చారు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేశారని కవిత పేర్కొన్నారు. మా ఎంపీలతో పాటు మీ వాళ్ళు కూడా వచ్చి నిలబడ్డారని పేర్కొన్న కవిత, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కెసిఆర్ గారు గురించి మాట్లాడుతున్న మీరు హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా అన్నారు .

వ్యవసాయ బిల్లులపై,వరద సాయం పై ప్రశ్నలు
వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయల ఉపశమనాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ అధికారిక లేఖ ఎందుకు ఇచ్చింది? అంటూ కవిత ప్రశ్నించారు.
ఇక ఇదే సమయంలో మీరు మా రాష్ట్రానికి కొత్తవారని మాకు తెలుసు కానీ మీరు సాధ్యమైనంతవరకు మాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్న కవిత ఆయనకు ఒక ప్రశ్న సంధించారు . ఏదేమైనా, పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టటం గురించి రోస్టర్ ముందే తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు.