షాకింగ్: బండి సంజయ్ కారుపై దాడి -డబ్బు సంచులతో వచ్చారంటూ -పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ నడిబొడ్డులో తీవ్ర ఉద్రక్తత చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వాహనంపై దాడి జరిగింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు, స్థానిక వర్గాలు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..
రేపు ఇలా జరిగితే బీజేపీదే గెలుపు -గ్రేటర్ పోలింగ్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సరదాగా గడిపేందుకు..
గ్రేటర్ లో పది రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచారం ఆదివారంతో ముగిసింది. మంగళవారం నాటి పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నవంబర్ 30 కార్తీక సోమవారం కావడంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పార్టీలోని ఇతర నేతలతో కలిసి రోజంతా పలు ఆలయాల్లో పూజలు చేశారు. చీకటి పడ్డా తర్వాత కాస్త సేదతీరేందుకు సరదాగా నెక్లెస్ రోడ్డుకు వెళ్లారని బీజేపీ నేతలు చెబుతున్నారు. పీపుల్స్ ప్లాజాలో కాసేపు గడిపి, అక్కడి నుంచి లేక్ వ్యూ పోలీస్ ఔట్ పోస్టు సమీపంలోని మినర్వా హోటల్ కు వెళ్లారు. కొద్ది గంటల్లో పోలింగ్ పెట్టుకుని సంజయ్ ఆ ప్రాంతంలో సంచరిస్తుండటంపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈక్రమంలో..
జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనం

డబ్బులు పంచేందుకే..
తన డివిజన్ లోని ఓటర్లను మభ్యపెట్టేందుకే బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రయత్నించారని ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి ఆరోపించారు. తన అనుచరులతో కలిసి ఆమె.. బీజేపీ నేతలున్నచోటుకు వెళ్లి.. ఇక్కడెందుకున్నారని నిలదీశారు. దీంతో సంజయ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈలోపే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ డబ్బులు పంచడానికే వచ్చారని ఆరోపిస్తూ.. ఆయన కారును తనిఖీ చేయాల్సిందిగా విజయారెడ్డి డిమాండ్ చేశారు. ఈలోపు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకొంత మంది అక్కడికి రావడంతో ఘర్షణ జరగొచ్చని పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందుగా..

బండి కారుపై దాడి..
అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు.. ముందుగా బండి సంజయ్ ను ఆయన వ్యక్తిగత వాహనంలో పంపించేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు.. సంజయ్ వ్యక్తిగత వాహనం వెనుకే.. పార్టీ ఆయనకు కేటాయించిన మరో వాహనాన్ని అడ్డుకున్నారు. కారుపై చేతులతోనే దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్ సహా లోపలున్నవాళ్లను బయటికి లాగే ప్రయత్నం చేశారు. పోలీసులు వారించినా గులాబీ శ్రేణులు వెనక్కితగ్గలేదు. ఇటు బీజేపీ శ్రేణులు కూడా అటుగా రావడంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం నెక్లెస్ రోడ్డులో పరిస్థితి ప్రశాంతంగా ఉంది.