గల్ఫ్‌కి పంపిస్తాం... కానీ మాతో లాడ్జికి రావాల్సిందే.. హైదరాబాద్‌లో మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్ట్...
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ ముఠాను మంగళవారం(ఫిబ్రవరి 9) హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఇప్పిస్తామని ఆశజూపి... అమాయక మహిళలను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు,గల్ఫ్‌కి పంపించేముందు తమతో గడపాలని... అలాగైతేనే వీసా,పాస్‌పోర్ట్ ఇస్తామని వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఓ బాధిత యువతి ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఈ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

గల్ఫ్ వెళ్లాలనుకున్న హైదరాబాద్ యువతి...
పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌లోని మేడిపల్లికి చెందిన ఓ యువతి గల్ఫ్‌కి వెళ్లి సంపాదించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె పిన్ని కూడా అక్కడే పనిచేస్తుండటంతో.. ఆమె లాగే తను కూడా సంపాదించవచ్చునని భావించింది. ఈ క్రమంలో ఆమె పిన్నిని మస్కట్‌కు పంపించిన ఏజెంట్‌ను ఆ యువతి సంప్రదించింది. ఆ ఏజెంట్ ఆమెను ఏపీలోని కడప జిల్లాకు చెందిన నూనె సుబ్బమ్మ, గుండుగుల సుబ్బారాయుడు, సయీద్‌లతో పరిచయం చేశాడు.

లాడ్జికి వచ్చి గడపాలని హుకుం...
పాస్‌పోర్టు,వీసా,ఇతరత్రా ఖర్చుల పేరుతో యువతి నుంచి ఆ ముఠా భారీగానే డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 9) ఉదయం ఫ్లైట్‌కి మస్కట్ టికెట్‌కు బుక్ అయిందని... ఒకరోజు ముందే శంషాబాద్ వచ్చి లాడ్జిలో ఉండాలని ఆ యువతికి ముఠా సమాచారామిచ్చింది. అప్పటికే శంషాబాద్‌లో లాడ్జి కూడా బుక్ చేశారు. లాడ్జికి రావాల్సిన అవసరం ఏముందని గట్టిగా ప్రశ్నించడంతో... తమతో గడపాలని హుకుం జారీ చేశారు. అలా అయితేనే పాస్‌పోర్టు, వీసా, ఫ్లైట్ టిక్కెట్లు ఇస్తామని బెదిరించారు.

అనుమానంతో పిన్నికి ఫోన్ చేయగా...
వారిపై అనుమానంతో ఆ యువతి తన పిన్నికి ఫోన్ చేసింది. అక్కడ తన పరిస్థితి ఏమీ బాగా లేదని... తనను విజిట్ వీసాతో మస్కట్‌కి పంపించి మోసం చేశారని ఆమె ఫోన్లో వాపోయింది. అక్కడి అరబ్ షేక్‌లు తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ముఠాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని హెచ్చరించింది. దీంతో ఆ యువతి పోలీసులకు సమాచారమిచ్చింది. ఆపై వారితో కలిసి శంషాబాద్‌లో వారు బుక్ చేసిన లాడ్జి వద్దకు వెళ్లింది.

రంగంలోకి దిగిన పోలీసులు...
లాడ్జి గదిలో ఉన్న ఇంతియాజ్, సుబ్బమ్మ, సుబ్బారాయుడు, మహమ్మద్ హారూన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురినీ విచారించగా... వీరు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నిర్దారించారు. ఇందులో ఓల్డ్ మలక్‌పేట్‌లోని అల్-హయాత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. విదేశాల్లో ఉద్యోగం పేరుతో మహిళలను అరబ్ షేక్‌లకు అప్పగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఒక్కో అరబ్ షేక్ నుంచి రూ.5లక్షలు వసూలు చేసి మహిళలను తరలిస్తున్నట్లు నిర్దారించారు. ముఠా నిర్వాహకుడు మహమ్మద్ నసీర్, అతని కూతురు సుమియా ఫాతిమా, సయ్యద్ అనే మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ఏజెంట్లను సంప్రదించవద్దని హెచ్చరిక...
మలక్‌పేటలోని అల్-హయాత్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ప్రభుత్వ లైసెన్స్ ఉండటంతో దాని రద్దుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇప్పటివరకూ 20 మంది మహిళలను గల్ఫ్ దేశాలకు పంపించిందని... మరో 40 మందిని పంపించే పనిలో నిమగ్నమైందని దర్యాప్తులో తేలిందన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు ఏజెంట్లను సంప్రదించి మోసపోవద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కో(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ)ను గానీ విదేశాంగ శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెన్సీలను గానీ సంప్రదించాలని సూచించారు.