మలక్‌పేట్ డీమార్ట్ వద్ద కారు బీభత్సం, టీకొట్టులోకి దూసుకెళ్లింది
హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్ఠేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మలక్‌పేట్‌లోని డీమార్ట్ వద్ద రివర్స్ తీసుకునే క్రమంలో కారు సమీపంలోని టీ కొట్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపురాజు అనే వ్యక్తి మలక్‌పేట్ డీమార్ట్‌లో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం తన కారును పార్కింగ్ నుంచి బయటికి తీశాడు. రివర్స్ తీసుకునే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న టీ కొట్టులోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇంఛార్జీకి గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డంపర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లిలో జిల్లాలో సింగరేణి వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సింగరేణి ఓపెన్ కాస్ట్-1కు సమీపంలో ఉన్న గడ్డిగానిపల్లి గ్రామస్తుడు లింగయ్యను డంపర్ వాహనం ఢీకొట్టింది. దీంతో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సింగరేణికి చెందిన నాలుగు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, సింగరేణి అధికారులు.. వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.