పవన్ కళ్యాణ్ భారీ విరాళం: వరద బాధిత ప్రజలకు అండగా ఉండాలని పిలుపు, సిటీలో మళ్లీ వర్షం
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ వరద బాధితులకు తనవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ స్పందించి తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలని కోరారు. వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ భారీ సాయం
వరద బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. తెలంగాణలో భారీ వర్షాలు, వదరల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖలంతా ముందుకు రావాలని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించి.. భారీ ఎత్తున విరాళంగా అందజేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని, మరింత మంది సాయం చేసేందుకు ముందుకు రావాలని సినీ ప్రముఖులు కోరారు.

వర్షాలు, వరదలతో భారీ నష్టం.. కేసీఆర్ పిలుపుతో
గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలు ఇళ్లు కూలిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మహా నగరంలో వరద నీటితో స్తంభించిపోయింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఉదారంగా విరాళాలు ఇచ్చేందుకు ప్రముఖులు ముందుకు రావాలని కోరడంతో
మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి, మహేశ్ బాబు రూ. కోటి అందజేయగా, అక్కినేని నాగార్జున రూ. 50 లక్షలు అందించారు. హీరో ప్రభాస్ కూడా రూ. కోటి విరాళం అందించారు. జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, హీరో రామ్ రూ. 25 లక్షలు, యువ హీరో విజయ్ దేవరకొండ రూ. 10 లక్షల విరాళం అందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎన్ రాధాకృష్ణ రూ. 10 లక్షల చొప్పున ప్రకటించారు. హరీశ్ శంకర్ రూ. 5 లక్షలు, అనిల్ రావిపూడి రూ. 5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ. 5 లక్షలు సాయం ప్రకటించారు.

మరో రెండ్రోజులపాటు వర్షాలు
అల్పపీడనం, ఆవర్తనం కారణంగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. కాగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరు ఇళల్లోకి చేరుకోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్లలేని.. ఇళ్లల్లో ఉండలేని పరిస్తితి నెలకొంది. అయితే, వరుసగా పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఇంకా ఆగడం లేదు. బుధవారం కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మళ్లీ వర్షంతో పెరిగిన ముంపు.. మంత్రుల పర్యటన, ఓదార్పు
బుధవారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, సైదాబాద్, సంతోష్ నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు మరోసారి వరదనీట మునిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు సాయాన్ని అందిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించి వారికి రూ. 10వేల చెక్కులను అందించారు.