బీజేపీని ఎలా ఆపాలో హైదరాబాద్ చూపించింది .. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ తనయ కవిత
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 55 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల తో పోల్చుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు ఊహించని ఫలితాలను ఇవ్వలేదు. అనూహ్యంగా గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ లాభపడింది. గత ఎన్నికల సమయంలో నాలుగు స్థానాలకు పరిమితమైన బిజెపి, ఈసారి ఏకంగా 48 స్థానాలకు చేరుకుంది. దీంతో గ్రేటర్ మేయర్ స్థానం దక్కించుకోవడానికి కావలసిన సంఖ్యా బలం లేకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ మేయర్ స్థానం కోసం ఎంఐఎం మద్దతు కోరటం తప్పనిసరిగా మారింది .

ఆత్మ పరిశీలనలో టిఆర్ఎస్ పార్టీ ..12 చోట్ల స్వల్ప తేడాతోనే ఓటమి
ఇక తాజా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు, కెసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత మేయర్ పీఠం దక్కించుకోవడానికి, ఇప్పుడే హడావుడి అవసరం లేదని, దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఎన్నికల ఫలితం టిఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలనకు కారణమైందని, పార్టీ ఆశించిన దానికంటే ఫలితాలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పారు. 12 నియోజకవర్గాల్లో చాలా తక్కువ మార్జిన్ తో ఓటమిపాలయ్యాము అని కవిత పేర్కొన్నారు.

దూకుడుగా వెళ్ళిన బీజేపీ ప్లాన్ అర్ధమైంది .. భవిష్యత్లో మరో మాస్టర్ ప్లాన్ తో టీఆర్ఎస్
బీజేపీ నేతలు గందరగోళ సృష్టించారని , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ద్వారా ప్రతిచోట దూకుడుగా వెళ్ళిన బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకున్నామని, 2023 లో మేము వ్యూహాలలో బిజెపి కంటే ఒకడుగు ముందుకు ఉండేలా చూసుకుంటామని కవిత పేర్కొన్నారు.
60 లక్షల మంది సభ్యులతో, చక్కగా వ్యవస్థీకృతమైన పార్టీ తమదని చెప్పిన కవిత, ఈ మాత్రానికే టిఆర్ఎస్ పార్టీ బలహీనపడిపోదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించకుండా టిఆర్ఎస్ పార్టీ నిరోధించిందని , భవిష్యత్తులో బీజేపీని ఆపడానికి హైదరాబాద్ ఎన్నికలు మార్గం చూపించాయని కవిత స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ కు ఊహించని దెబ్బ .. ఎన్నికల్లో విజయం సాధించినా హంగ్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టిఆర్ఎస్ 150 వార్డులలో 55 గెలిచింది. బిజెపికి 48, ఎఐఎంఐఎం 44 స్థానాలను నిలుపుకున్నాయి. గత గ్రేట్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 99 స్థానాలు గెలవగా, బిజెపి నాలుగు స్థానాలు మాత్రమే సాధించాయి. అయితే ఈ ఎన్నికలలో కూడా విజయం సాధించిన అతి పెద్ద పార్టీ తమదేనని టిఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ గ్రేటర్ మేయర్ పీఠం విషయంలో కావాల్సిన మెజార్టీ లేక హంగ్ ఏర్పడింది . ఈ క్రమంలో ఎంఐ ఎం మద్దతు అనివార్యంగా మారింది .

టిఆర్ఎస్ మరియు ఎఐఐఎంల పొత్తు ఖరారైతే బీజేపీకి మరో ఆయుధం
టిఆర్ఎస్ మరియు ఎఐఐఎంల మధ్య "అపవిత్ర కూటమి" ఉందని బీజేపీ పదేపదే ఆరోపణలు చేసింది. రెండు పార్టీలు, అధికారికంగా భాగస్వాములు కాకపోయినప్పటికీ, స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఆ అనధికారిక స్నేహం ఇప్పుడు గ్రేటర్లో టిఆర్ఎస్ పార్టీకి కావలసిన మెజారిటీ ఇవ్వకపోవడంతో అధికారికం అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ ఎంఐఎం లపై దాడి చేయడానికి మరో ఆయుధం దొరికినట్టు అవుతుంది. ఏదేమైనా హైదరాబాద్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీని ఆత్మపరిశీలన చేసుకునేలా చేశాయని, భవిష్యత్తులో జాగ్రత్త పడాలని చెప్పాయని కెసిఆర్ తనయ కవిత పేర్కొన్నారు.