హైదరాబాద్లో దారుణం : మహిళపై రేప్.. కనుగుడ్డు చిట్లిపోయి,జననాంగానికి తీవ్ర గాయమై..
హైదరాబాద్లోని మూసాపేటలో జరిగిన ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూలీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ మహిళను ఆమెకు తెలిసిన వ్యక్తి ఇంటి వద్ద దిగబెడుతానని బైక్పై ఎక్కించుకున్నాడు. ఆపై ఆమె ఇంటి వైపు కాకుండా ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె తలపై బండరాయితో మోది,జననాంగాన్ని గాయపరిచి హత్యాయత్నం చేశాడు. ఆమె చనిపోయిందనుకుని అక్కడినుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలికి మరుసటిరోజు మెలకువ వచ్చి మెల్లిగా తన ఇంటికి చేరుకుంది. ఈ నెల 25న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... మూసాపేటకు చెందిన ఓ మహిళ (50) స్థానికంగా కూలీ పని చేసుకుంటూ తన తల్లితో కలిసి ఉంటోంది. కొన్నేళ్ల క్రితం భర్తతో విబేధాల కారణంగా విడిపోయి తల్లి వద్దే ఉంటోంది. గతంలో వీరు యాదవబస్తీలో నివాసం ఉన్న సమయంలో పొరుగింటిలో ఉండే సెంట్రింగ్ మేస్త్రీ రాము(38) పరిచయమయ్యాడు. కొంతకాలంగా ఆమెపై కన్నేసిన రాము.. ఆమె కదలికలపై దృష్టి పెట్టాడు. రోజూ కూలీ పనికి వెళ్లే ఆ మహిళ సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుందని తెలుసుకున్నాడు.

లిఫ్ట్ ఇస్తానని నమ్మించి...
శుక్రవారం(డిసెంబర్ 25) సాయంత్రం ఆ మహిళ ఎప్పటిలాగే కూలీ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఆ మహిళ కోసం అదే దారిలో రాము మాటు వేసి ఉన్నాడు. ఆమె మూసాపేట నర్సింహస్వామి ఆలయం వద్దకు రాగానే ఆమెతో మాటలు కలిపాడు. తనూ అటువైపే వెళ్తున్నానని చెప్పి బైక్ ఎక్కమన్నాడు. అతని చెడు ఆలోచనను పసిగట్టని ఆ మహిళ నమ్మి బైక్ ఎక్కింది. కానీ రాము ఆ మహిళను ఆమె ఇంటివైపు కాకుండా రాఘవేంద్ర సొసైటీ సమీపంలోని చెట్ల పొదల వద్దకు తీసుకెళ్లి.. ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లాడు.

అత్యాచారం... హత్యాయత్నం...
అక్కడే రాము ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్రంగా పెనుగులాడటంతో ఆమె తల,ముఖంపై బండరాయితో కొట్టాడు. ఆమె జననాంగాన్ని తీవ్రంగా గాయపరిచాడు. దాడిలో కనుగుడ్డు చిట్లిపోవడం,తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో ఆ మహిళ చనిపోయిందని భావించిన రాము అక్కడినుంచి పరారయ్యాడు. కానీ మరుసటిరోజు ఆ మహిళకు మెలకువ రావడంతో కదల్లేని స్థితిలోనే ఒక్కో అడుగు వేస్తూ ఇంటికి చేరుకుంది. కూతురు లోదస్తులతో తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకోవడంతో ఆమె తల్లి షాక్ తిన్నది.

కేసు నమోదు... నిందితుడు పరార్..
అనంతరం తల్లి సాయంతో బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితురాలు తనపై ఫిర్యాదు చేసిందన్న విషయం తెలుసుకుని... నిందితుడు రాము కుటుంబంతో సహా ఇంటి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితురాలిపై అతనొక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడా... లేక గ్యాంగ్ రేప్ జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.