మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ: వస్తువులు బయట పారేసి, ఓ నేత కొడుకు బెదిరింపులు?
హైదరాబాద్: మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెటర్ భోగి శ్రావణి కుటుంబం నివాసం ఉంటోంది. అయితే, వారుండే ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

మహిళా క్రికెటర్ శ్రావణి ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ
నోటీసులు ఇచ్చిన తర్వాత వారి ఇంటి వెనుక గోడ పడిపోయేలా ఉందని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. దీంతో పక్కనేవున్న కమ్యూనిటీ హాల్ కు క్రికెటర్ శ్రావణి కుటుంబం షిప్ట్ అయ్యింది. అయితే, తాము జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన గోడకు, ఇంటికి మరమ్మతులు చేసినప్పటికీ.. ఇంటిని కూల్చేశారని వాపోయింది శ్రావణి. ఈ మేరకు క్రికెటర్ భోగి శ్రావణి తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఇంట్లో వస్తువులు బయటపారేసి.. ఓ నేత కొడుకు బెదిరింపులు?
35 ఏళ్లుగా ఆ ఇంట్లో శ్రావణి కుటుంబం ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఇంటి వెనుక గోడ కూలిపోయేలా ఉందని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారని శ్రావణి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ఇంటికి మరమ్మతులు చేయించినప్పటికీ.. జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారని వాపోయారు. తమ ఇంట్లోని వస్తువులను బయటపడేసి మరి కూల్చివేశారని శ్రావణి కుటుంబససభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఘటనలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారుడు రామేశ్వర్ గౌడ్, ఆయన అనుచరుల హస్తం ఉందని క్రికెటర్ శ్రావణి ఆరోపించింది. ఈ మేరకు పద్మారావు గౌడ్ కార్యాలయానికి పిలిపించి రామేశ్వర్ బెదిరించాడని, రూ. 2 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని చెప్పాడని తెలిపింది.

క్రికెట్ ఆడాలా? ఇల్లు వెతుక్కోవాలా?: శ్రావణి ఆవేదన
ఇప్పుడు తాముంటున్న ఇల్లు ఒక్కసారిగా కూల్చడంతో ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదని శ్రావణి వాపోయింది. కాగా, ఏప్రిల్ 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే మహిళా టీ-20 టోర్నమెంట్లో రంజీ క్రికెటర్ అయిన భోగి శ్రావణి పాల్గొనాల్సింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను తన నివాసం కోసం చూడాలా? లేక క్రికెట్ ఆడాలా? అనే సందేహంలో ఉన్నట్లు శ్రావణి వాపోయింది. ప్రభుత్వం తమకు షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతోంది.