గ్రేటర్లో బీజేపీని గెలిపిస్తే... వరద సాయం అందినవాళ్లకు కూడా మళ్లీ డబ్బులిస్తాం.. : బండి సంజయ్
వరద సాయం నిలిపివేయాలని తాను ఈసీకి లేఖ రాయలేదని... తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల కమిషనే తమకెలాంటి లేఖ అందలేదని చెప్పిందని... మరి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కొంతమంది టీఆర్ఎస్ మంత్రులు.. భాగ్యలక్ష్మి ఆలయానికే ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారని... అక్కడికే ఎందుకు వెళ్లకూడదని తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. భాగ్యలక్ష్మి ఆలయమేమైనా పాకిస్తాన్లో ఉందా.. బంగ్లాదేశ్‌లో ఉందా అని నిలదీశారు.

ఏ ఆలయం వద్దకు వస్తారో చెప్పండి....
భాగ్యలక్ష్మి ఆలయం కాకపోతే హైదరాబాద్‌లో ఏ హిందూ దేవాలయం వద్దకు వస్తారో చెప్పాలని... తానూ అక్కడికే వస్తానని సవాల్ విసిరారు. దుబ్బాక ఎన్నికల్లోనూ ఒక ఛానెల్ లోగోతో తమను బద్నాం చేసే ప్రయత్నం చేశారని... ఇప్పుడు జీహెచ్ఎంసీలో లేఖ పేరుతో తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై ఇప్పటికే ఈసీకి,సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశామని... ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులకే యువకులను అరెస్ట్ చేసే టీఆర్ఎస్ పార్టీ... ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సంతకం ఫోర్జరీ జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. దీనిపై ఇప్పటికైనా సీఎం స్పందించకపోతే ప్రజలు ఆయన్ను నమ్మరని పేర్కొన్నారు.

గ్రేటర్లో గెలిపిస్తే రూ.20వేలు
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఇంటికి రూ.20వేలు ఆర్థిక సాయం అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. అంతేకాదు,ఇప్పటికే రూ.10వేలు ఆర్థిక సాయం అందినవాళ్లకు కూడా మళ్లీ డబ్బులిస్తామని చెప్పారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని విమర్శించారు. మీరు రోహింగ్యాల గురించి మాట్లాడితే తప్పు లేనప్పుడు... తాము హిందువుల గురించి మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. అసలు హైదరాబాద్‌లో ఎంతమంది రోహింగ్యాలు,పాకిస్తానీలు,బంగ్లాదేశీయులు ఉన్నారో లెక్కలు తీయాలన్నారు. సీఏఏ విషయంలో 30కోట్ల మంది ముస్లింలను దేశం నుంచి పంపిస్తారా అని సీఎం మాట్లాడారని... మరి ఎంఐఎం,టీఆర్ఎస్ కలిసి రాష్ట్రం నుంచి హిందువులను బయటకు పంపిస్తారా అని ప్రశ్నించారు.

గెలిచేది బీజేపీనే.. సంజయ్ ధీమా
రోహింగ్యాలను టీఆర్ఎస్ తమ ఓటు బ్యాంకుగా మలుచుకుందని ఆరోపించారు. తమను నియంత్రించే శక్తి టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని నియంత్రించేందుకే ప్రజలు తమను ఆదరిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ మేయర్ పీఠం ఎంఐఎంకి కట్టబెడితే భాగ్యలక్ష్మి ఆలయానికి కాదు కదా ఏ ఆలయానికి వెళ్లనివ్వరని చెప్పారు. యువకులు బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతుండటంతో కారణం లేకుండా వారికి చలాన్లు విధిస్తున్నారని ఆరోపించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని... గ్రేటర్లో గెలవబోయేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.