మీ అంతు చూస్తా .... బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో యువతి హల్ చల్
డ్రగ్స్ మత్తులో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక యువతి వీరంగం సృష్టించింది. పోలీస్ స్టేషన్లో పోలీసులపైన దాడికి తెగబడింది. మీ అంతు చూస్తానంటూ హల్ చల్ చేసింది.
డ్రగ్స్ తీసుకుని అపస్మారకంగా పడి ఉన్న ఓ యువతిని బంజారాహిల్స్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అప్పటివరకు అపస్మారక స్థితిలోవున్న ఆమె మెలకువ రావడంతో తాను పోలీస్ స్టేషన్ లో ఉన్న విషయం గమనించి పారిపోయేందుకు ప్రయత్నించింది.
నాగాలాండ్ కు చెందిన లీసా మాదాపూర్ ప్రాంతంలోని ఐటీ కంపెనీలో పని చేస్తుందని గుర్తించిన పోలీసులు, పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమెను అడ్డుకున్నారు.

ఆమెను పట్టుకునే క్రమంలో లీసా పోలీసులపై దాడికి తెగబడింది. పోలీసులను కొరుకుతూ, గోళ్లతో రక్కుతూ దాడి చేస్తున్న లీసాను కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇక అంతే కాదు పోలీసులపై దాడికి పాల్పడిన లీసా మీ అంతు చూస్తా అంటూ బెదిరించింది.

అయితే ప్రస్తుత ఆమెను పోలీసులు ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్పగించే పనిలో ఉన్నారు. ఇంతకీ ఆమె డ్రగ్స్ తీసుకుందా? లేక మద్యం మత్తులో వీరంగం వేసిందా అనేది తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి రోడ్డుపై అపస్మారకంగా పడివున్న లీసాను కాపాడిన పోలీసులకే ఆమె చుక్కలు చూపించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!