ఆ మూడు పార్టీలతో పొత్తుకు నో: కేఏ పాల్ సంచలనం.. ఆ రెండు పార్టీలకు ఓకేనా మరీ..
కేఏ పాల్ ఫుల్ టైమ్ పొలిటిషీయన్లా మారినట్టు ఉన్నారు. రోజు ఏదో అంశంపై కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ పొత్తుల గురించి మాట్లాడారు. మరో ఏడాదిన్నరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై కేఏ పాల్ శుక్రవారం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేనలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని స్ఫష్టంచేశారు. వైసీపీ, బీజేపీ గురించి మాత్రం ప్రస్తావించలేదు. వైసీపీ ఏపీలో అధికారంలో ఉండగా.. బీజేపీ కేంద్రంలో పవర్లో ఉంది.
బలహీన వర్గాల వారికి చెందిన ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీయేనని చెప్పారు. తమ పార్టీ మినహా రాష్ట్రంలో ఇప్పుడున్న అన్ని పార్టీలపై జనంలో వ్యతిరేకత ఉందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నియోజకవర్గాల్లో తానే పర్యటిస్తానని చెప్పారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ శుక్రవారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయో పరిమితి పెంపుపై తాను ప్రశ్నిస్తేనే కేసీఆర్ స్పందించారని చెప్పారు. తాను 31 ఏళ్లకు పెంచమని చెబితే.. కేసీఆర్ ఏకంగా 32 ఏళ్లకు పెంచారని కేఏ పాల్ తెలిపారు.

కేఏ పాల్‌పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప మీద కొట్టాడు. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. ఆ తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పుడు పొత్తులపై మాట్లాడారు.