కేఏ పాల్: పాల్ రావాలి.. పాలన మారాలనే నినాదంతో పాదయాత్ర
పాదయాత్రల ద్వారా అధికారం చేపడుతున్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ పాదయాత్ర చేసి మరీ అధికార పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు మలి విడత కాగా.. జగన్, వైఎస్ఆర్ యాత్ర చేసి.. అధికారం దక్కించుకున్నారు. ఇప్పుడు షర్మిల జనం లోకి వచ్చారు. పవన్ కల్యాణ్ కూడా పాదయాత్ర చేస్తారట.. రేవంత్ రెడ్డి కూడా యాత్ర అని అంటున్నారు. వీరంతా ఓకే.. ఇప్పుడు కేఏ పాల్ వంతు వచ్చింది. ఆయన పాదయాత్రతో జనంలోకి వస్తున్నారు.


23 నుంచి పాదయాత్ర
ఈ నెల 23 నుంచి యాత్ర పాదయాత్ర చేపట్టనున్నానని కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి యాత్రను స్టార్ట్ చేసి,ఉమ్మడి జిల్లాల్లో కంటిన్యూ చేస్తాననిచెప్పారు. "పాల్ రావాలి.. పాలన మారాలి" అనే నినాదంతో యాత్ర చేపడుతున్నానని వివరించారు. యాత్రకు సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఫోన్లో కోరగా.. అంగీకరించారని వివరించారు. తెలంగాణ డీజీపీ మాత్రం స్పందించటం లేదన్నారు. ఈ నెల 9 నుంచి మొదట ఏపీలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నానని వివరించారు.

మరో ఏడాది సమయం.. అయినా
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది. ముందస్తు ఆలోచనలో ఇటు కేసీఆర్, అటు జగన్ ఉన్నారు. ఇప్పటి నుంచి ప్రజల్లో ఉంటే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనలో కేఏ పాల్ ఉన్నారు. ఇంత ముందు నుంచే పాదయాత్ర చేయాలనే కేఏ పాల్ అలోచన కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.

విశాఖ నుంచి పాదయాత్ర
తొలుత విశాఖపట్టణం నుంచి కేఏ పాల్ పాదయాత్ర మొదలవుతుంది. రోజు కనీసం ముగ్గురిని కలుస్తానని పాల్ చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని పాల్ తెలిపారు. ఎన్నికల సమయం నాటికి తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ మరో 2 లక్షల కోట్ల అప్పులు చేస్తారని తెలిపారు. ఇదీ ప్రజల మీద భారమేనని తెలిపారు. పనిలో పనిగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు మాదిరిగా తాను హైదరాబాద్ నుంచి పారిపోలేదని వివరించారు.