సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన... ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం(జనవరి 19) కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్ నుంచి కాళేశ్వరం చేరుకున్నారు.

ఈ సందర్భంగా కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అభివృద్దిపై స్థానిక అధికారులతో సీఎం మాట్లాడారు. అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు బయలుదేరారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను ఏరియల్ వ్యూ ద్వారా కేసీఆర్ పరిశీలించనున్నారు.
యాసంగి సీజన్లో పంట పొలాలకు కాళేశ్వరం నుంచి సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ప్రాజెక్టులో నీటి లభ్యతను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలు... ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీరు... రోజుకు ఎన్ని టీఎంసీలు విడుదల చేయాలి.. తదితర అంశాలపై కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయనున్నారు.

యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలివ్వనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అక్కడే భోజనం చేసి... మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు. సీఎం పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్,సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.