ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం రేపే .. రాష్ట్ర రాజకీయాల్లో అడుగు ..త్వరలో మంత్రిగా
సీఎం కెసిఆర్ తనయ, ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది . సభ నిరవధిక వాయిదా పడింది . రేపు శాసన మండలి సెషన్ కొనసాగనున్న నేపథ్యంలో రేపు శాసనమండలిలో కవిత కాలు పెట్టనున్నారు . ఈ క్రమంలో రేపు ఎమ్మెల్సీగా కవిత శాసనమండలి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసి సమావేశంలో పాల్గొనన్నున్నారు.
కవిత గెలుపు ...అన్ని ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ .. మంత్రులు హరీష్ ,ఎర్రబెల్లి మొదలెట్టేశారుగా!!

రేపే ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
రేపటి శాసనమండలి సమావేశంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణ చేయించనున్నారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా ఓటమిపాలైన తర్వాత కవిత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ గా ఎన్నికై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు .ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించడానికి, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లోనూ పట్టు సాధించడానికి రేపు శాసనమండలిలో అడుగు పెట్టి ముందడుగు వేయబోతున్నారు.

ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కవిత .. రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు
ఈ క్రమంలో తాజాగా ఆమె ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కుతుందని పార్టీ శ్రేణులలోనూ , రాజకీయ వర్గాల్లోనూ కీలక చర్చ జరుగుతోంది. సీఎం కుమార్తె కవితకు ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా క్యాబినెట్ ర్యాంకు లభిస్తుందని జోరుగా వార్తలు వస్తున్నాయి . సీఎం కేసీఆర్ తనయ కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారని, కేసీఆర్ మంత్రివర్గంలో కవితకు బెర్త్ ఖరారు అయ్యిందని చర్చ జోరందుకుంది .

దసరా గిఫ్ట్ .. మంత్రిగా కవితకు స్థానం .. ఆసక్తికర చర్చ
కవితకు నిజామాబాద్ ఎమ్మెల్సీగా కేవలం 15 నెలల కాలమే ఉంది . మరి ఈ సమయంలో ఆమె కేవలం ఎమ్మెల్సీగా పరిమితం అవుతారా అంటే సమస్యే లేదని చెప్తున్నారు ఆమె అనుయాయులు . ఈ నేపథ్యంలోనే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్థిస్థాయి మంత్రివర్గం కొలువుతీరి ఉన్న నేపథ్యంలో ఆమెను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కవిత పట్టు నిలుపుకోవటం కోసం నిజామాబాద్ నుండి మంత్రిగా ఆమెకు ప్రాతినిధ్యం దక్కుతుందా.. ఎవరికి చెక్ పెడతారు అన్నది ఇప్పుడు నిజామాబాద్ లో చర్చనీయాంశంగా మారింది.