tpcc race: హైకమాండ్ దూతతో కోమటిరెడ్డి భేటీ, హోటల్లో మంతనాలు
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రోజుకో ఒక కొత్త పేరు వినిపిస్తోంది. ప్రధానంగా ఇద్దరీ మధ్యే పోటీ నెలకొంది. ఈ క్రమంలో వారికి అనుకూలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ నేతల అందరీ అభిప్రాయాలను హై కమాండ్ వింటోంది. మరో వారం రోజుల్లో పీసీసీ చీఫ్ ఎవరో తేలుస్తామని స్పష్టంచేసింది. ఇంతలో హైకమాండ్ పెద్దలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎవరినీ వరించెనో..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేపట్టే పనిలో పడింది హైకమాండ్. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ... తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డ రాజీనామా చేయడంతో పీసీసీ చీఫ్ ఎంపికి అనివార్యంగా మారింది. పలువురు నేతలు టీపీసీసీ రేసులో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎవరి పేరు కూడా ప్రకటించలేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో కీలక నేతతో భేటీ అయ్యారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ కేరాతో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుత సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

షీలా దీక్షిత్ వద్ద పనిచేసి..
ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ వద్ద ప్రత్యేక అధికారిగా పవన్ ఖేరా పనిచేశారు. సోనియా, రాహుల్‌తో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డితోపాటు జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్ రావుతో కూడా పవన్ ఖేరా సమావేశమయ్యారు. వీరి మధ్య కొత్త పీసీసీ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరుగినట్టు పార్టీవర్గాలు భావిస్తున్నాయి. కానీ మీడియాతో వారు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు.

కార్యవర్గ కూర్పు
టీ పీసీసీ చీఫ్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్, వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించే పనిలో హైకమాండ్ పడింది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. వారం రోజుల్లో పీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో కోమటిరెడ్డి మరోసారి హైకమాండ్‌కు చెందిన ముఖ్య నేతలతో భేటీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. పలువురు సీనియర్ నాయకులను ఢిల్లీకి పిలిచి హైకమాండ్ చర్చలు జరుపుతోన్నట్టు తెలుస్తోంది.