అందుకే తొలి టీకా వేయించుకున్నా..: కిష్టమ్మ, ప్రధాని చెప్పారనే టీకా వేసుకోలేదన్న కేటీఆర్
హైదరాబాద్: కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని, అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తిలక్ నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొంతు రామ్మోహన్, కలెక్టర్ శ్వేతా మహంతి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

కరోనా టీకాలు సురక్షితమైనవే..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా టీకాలు చాలా సురక్షితమైనవని, టీకా వేయించుకునేందుకు ఎవరూ భయపడొద్దని అన్నారు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులం కూడా త్వరలో టీకా వేయించుకుంటామని చెప్పారు.

కరోనా మహమ్మారికి ముగింపు ప్రారంభం..
మనదేశ పరిస్థితులకు అనుగుణంగా టీకా తయారీ జరిగిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కూడా టీకా తయారు చేసిందని, టీకా తయారీదారుల్లో హైదరాబాద్ సంస్థ ఉండటం గర్వకారణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో అందరికీ టీకా అందుతుందని స్పష్టం చేశారు. మహమ్మారికి ముగింపు ప్రారంభమైందని, అందరూ సుఖసంతోషాలతో ఉండే రోజులు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు.

వ్యాక్సిన్ వేసుకోవద్దని పిల్లలు వదన్నారు కిష్టమ్మ
కాగా, తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తెలంగాణలో తొలి టీకా వేయించుకున్నారు పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మ తన వ్యాక్సిన్ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. టీకా వేయించుకుంటానంటే తొలుత తమ పిల్లలు వద్దన్నారని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకునే వారి జాబితాలో మొదటి పేరు తనదే ఉందన్నారు.

అందుకే టీకా వేయించుకున్నానంటూ కిష్టమ్మ..
తాను టీకా వేయించుకుంటే మిగిలినవారు కూడా ధైర్యంగా ఉంటారని భావించి వేసుకున్నానని తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తమతో రెండుసార్లు సమావేశమై ధైర్యం చెప్పారని తెలిపారు. ఇప్పుడు తాను టీకా తీసుకున్నానని.. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. అరగంటసేపు అబ్జర్వేషన్ లో ఉంచారని, తనకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. అందరూ నిర్భయంగా టీకా వేసుకోవచ్చని స్పష్టం చేశారు కిష్టమ్మ.