రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత సంచారం.. లేగ దూడపై దాడి, మృతి.. స్థానికుల ఆందోళన
హైదరాబాద్ శివారులో గల రాజేంద్రనగర్‌లో తరచూ చిరుతపులుల కనిపిస్తుంటాయి. సమీపంలో చెట్లు, పొదలు ఉండటంతో అవి వస్తుంటాయి. కానీ చిరుతపులుల సంచారంతో స్థానికులు మాత్రం బెంబేలెత్తిపోతుంటారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని.. కాలం వెళ్లదీస్తుంటారు. అయితే మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్‌లో లేగదూడపై దాడి చేయడంతో మరోసారి చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది.

లేగ దూడపై దాడి, మృతి..
రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్‌సాగర్ వెళ్లే మార్గంలో వాలంతరీ కార్యాలయం వెనక భాగంలో కొందరు రైతులు గడ్డి పెంచి విక్రయిస్తుంటారు. షఫీ అనే వ్యక్తి కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని గేదెలు, నాలుగు ఆవులను పెంచుతున్నాడు. నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుక్కలు, గేదెలు, ఆవుల అరిచాయి. కుటుంబసభ్యులతో కలిసి పశువుల పాకవైపు షఫీ వచ్చాడు. ఓ లేగదూడ చనిపోయి కనిపించింది. ఏదో జంతువు పక్కనేగల పొదల్లోకి వెళ్లినట్లు షఫీ గమనించి.. రాజేంద్రనగర్ పోలీసులు..అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శబ్దం చేస్తూ వచ్చిన సమయంలో పొదల్లోకి వెళ్లిన జంతువు చిరుతే కావచ్చని అనుమానం వ్యక్తంచేశాడు.

చిరుత.. హైనా..?
ఫారెస్టు రేంజ్ అధికారి శ్యామ్‌కుమార్, రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేగదూడపై దాడి చేసింది చిరుతేనని స్పష్టంగా చెప్పలేమన్నారు. లేగదూడపై దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, దూడ శరీర భాగం తిన్నట్లు కనిపిస్తోందన్నారు. ఆ పరిసరాల్లో హైనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అవి దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదివనరే వర్సిటీ పైభాగంలో డత అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. రెండు నెలల క్రితం గగన్‌పహాడ్‌లోని ప్రధాన రహదారిపై కనిపించిన చిరుత పక్కనే ఉన్న వర్సిటీ అడవుల్లోకి వెళ్లిందన్నారు.

మూడుసార్లు కనిపించినా..
మూడు సార్లు చిరుత కనిపించినా.. నెలన్నర నుంచి ఎలాంటి కదలిక రాలేదన్నారు. బుధవారం లేగదూడపై దాడితో చిరుత కదలిక మరోసారి కనిపించింది. గాంధీనగర్, హనుమాన్‌నగర్, కిస్మత్పూర్, దర్గాఖలీజ్‌ఖాన్ నివాస ప్రాంతాల్లో గల ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. వర్సిటీ అడవుల్లో చిరుత ఉందని భావించామని, ప్రస్తుతం అడవుల నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తుండటంతో ఏంజరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.