లోన్ యాప్ వేధింపులు.. లక్షకు మరో లక్ష.. యువతీ సూసైడ్.. 10 లక్షల డౌన్ లోడ్స్
లోన్ యాప్ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రుణం తీసుకునే వరకు తీసుకోవాలని వెంటపడతారు.. తీసుకున్నాక కట్టమని వెంటబడతారు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లోన్ యాప్ హరాస్ మళ్లీ వినిపిస్తోంది. మనీ కావాలని క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. కొంత వడ్డీ తీసుకుంటారు. రెగ్యులర్‌గా కడితే ఓకే లేదంటే అంతే సంగతులు. ఫోటో పెట్టి.. డబ్బులు తీసుకున్నాడు తిరిగి ఇవ్వడం లేదు.. మోసం చేస్తున్నాడు.. అంటూ తెలిసిన వారికి, పరిచయం ఉన్న వారికి మేసేజీ పెడతారు. తెలిసిన వారికి ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినా.. వడ్డీ పెరిగిందని, ఛార్జీలు కట్టాలని వేధిస్తారు.

లక్ష తీసుకుంటే.. రూ.2 లక్షలు
లక్ష రూపాయాలు తీసుకొని వడ్డీగా 2 లక్షలు కట్టిన ఘటనలు ఉన్నాయి. వడ్డీకి చక్రవడ్డీ.. ఆపై భూచక్రవడ్డీ లెక్కలు వేసి జలగలు పీల్చినట్లు.. జనాల రక్తం పీలుస్తున్నాయి. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. ప్రభుత్వాలు, పోలీసులు.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఖమ్మం జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. తీసుకున్న రుణం చెల్లించినా.. మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. అప్పు ఇంకా తీరలేదని.. చెల్లించకపోతే ఇంట్లో వాళ్ల ఫొటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్సైట్లలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు.

యువతి బలవన్మరణం..
మధిర పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని లోన్‌యాప్ నిర్వాహకులు మాములుగా వేధించడలేదు. యువకుడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఫోన్ నంబర్లకు మోసగాడు అంటూ మెసేజ్ పంపారు. అప్పు ఇచ్చే ముందు ఆ యువకుడి ఆధార్‌తోపాటు అతని తల్లి ఆధార్ ఫొటో కాపీలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకొని అతనికి నరకం చూపిస్తున్నారు. మంచిర్యాలకు చెందిన ఓ యువతిని కూడా ఇలానే బెదిరించారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. వాటిని అందరికి పంపిస్తామని బెదిరించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి చనిపోయిన ఫొటోను పంపించాలని డిమాండ్ చేశారు.

వామ్మో 10 లక్షల డౌన్ లోడ్సా..?
హైదరాబాద్‌లో లోన్‌యాప్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్యే వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్‌ల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. బబుల్ లోన్, లిక్విడ్ క్యాష్, రుపీ ఫ్యాక్టరీ, పైసా లోన్, ఫ్లిప్‌క్యాష్, ఇన్‌నీడ్, రుపీప్లస్, పాన్‌లోన్, క్యాష్‌పాట్, వన్‌హోప్... ఇలా వీటికి అంతేలేదు. గూగుల్ ప్లే స్టోర్‌లో 500 వందల పైగా ఇలాంటి యాప్స్ ఉన్నాయి. ఒక్కో యాప్ 10 లక్షలకుపైగా డౌన్లోడ్స్ ఉన్నాయంటే ఇవి ఎంతలా అల్లుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. లోన్ యాస్ ఉచ్చులో ఇరుక్కున్నారో ఇక అంతే సంగతులు.. వేధింపులు అంటే ఎంటో చూపిస్తున్నారు. సో వీరి ఆగడాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.