మేకిన్ ఇండియా.. వట్టి నినాదాలేనా? చైనాతో పోటీపడగలమా.. తెలంగాణకు అన్నింట్లో అన్యాయమే : కేటీఆర్
మేకిన్ ఇండియా,ఆత్మనిర్భర్ భారత్ నినాదాలు కేవలం నినాదాలుగా మిగిలిపోయాయని... ఆచరణలో,అమలులో ఎక్కడా అవి కనిపించట్లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇలా అయితే భారత్ చైనాతో ఎలా పోటీపడగలుగుతుందని అన్నారు. ఇటీవల తాను బయో ఆసియా సదస్సులో కొంతమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడినట్లు చెప్పారు. చైనా నుంచే వారు మెడికల్ డివైజ్‌లను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారన్నారు. భారత్‌లో దిగుమతి సుంకాలు విపరీతంగా ఉండటంతో చైనా వైపే మొగ్గుచూపుతున్నామని చెప్పినట్లు తెలిపారు. ఓవైపు మేకిన్ ఇండియా నినాదాలు ఇస్తూ...మరోవైపు మాన్యుఫాక్చరింగ్ రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపట్టకపోతే ఎలా అన్నట్లుగా కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

తెలంగాణకు అన్నింట్లో అన్యాయం : కేటీఆర్
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలేవీ కేంద్రం నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని... ఇప్పటివరకూ దాన్ని పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పుతామని... స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్‌కు ప్రకటించిన ఐటీఐఆర్‌కు సంబంధించి ప్రభుత్వం డీపీఆర్ సమర్పించినా... ప్రత్యేక శ్రద్ద తీసుకుని కృషి చేసినా ఇంతవరకూ దాని ఊసు కూడా లేదన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుని ఉంటే రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల కల్పన జరిగేదన్నారు.

రాజకీయ కోణంలో కేంద్రం నిర్ణయాలు : కేటీఆర్
కేంద్రం నిర్ణయాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోణంలో ఉంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అందుకే హైదరాబాద్,చెన్నై,బెంగళూరు లాంటి నగరాలకు కేంద్రం నుంచి ఏమీ రావట్లేదన్నారు. హైస్పీడ్ రైళ్లు,బుల్లెట్ రైళ్లు,ఇండస్ట్రియల్ కారిడార్స్.. దక్షిణాది రాష్ట్రాలకు ఇవేవీ లేవన్నారు. బుల్లెట్ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు రాదా? అని ప్రశ్నించారు.ఫార్మా రంగం కోసం 12వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే... కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందట్లేదన్నారు. కేంద్రం కేవలం ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలని హితవు పలికారు.

అభివృద్ది పథంలో తెలంగాణ : కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పారిశ్రామిక రంగంపై,హైదరాబాద్ అభివృద్దిపై ఎంతోమంది ఎన్నో సందేహాలు లేవనెత్తారని... కానీ సీఎం కేసీఆర్ పాలనలో అవన్నీ పటాపంచాలయ్యాయని అన్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం పురోగమించిందన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణ విషయంలో హైదరాబాద్ దేశంలోనే టాప్ 3గా ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ టాప్ 3లో ఉన్నామని చెప్పారు. కరోనా కన్నా ముందు వరుసగా రెండు సంవత్సరాలు తెలంగాణలో రెండంకెల వృద్ది రేటు నమోదైందన్నారు. కరీంనగర్,ఖమ్మం,వరంగల్ వంటి టైర్ 2 పట్టణాలకు కూడా ఐటీ సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ ఆదాయం రూ.57వేల కోట్లు ఉంటే... ఇప్పుడది రూ.1,44,000 కోట్లుగా ఉందన్నారు.