ఈ రోజు తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవటంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్
ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నేటి నుండి వ్యాక్సినేషన్ కు శ్రీకారం చుట్టడంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ సరఫరా అయిన రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ మొదలుపెట్టాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.
గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

భయాందోళన పోగొట్టటం కోసం తొలి వ్యాక్సిన్ తానే తీసుకుంటానన్న ఈటెల రాజేందర్
ముందుగా నిర్ణయించిన ప్రకారం మొదటి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకు ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో చాలామందిలో అపోహలు అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో వారిలో భయాన్ని పోగొట్టడం కోసం తానే తొలి వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించిన ఈటెల రాజేందర్ తాను మాత్రం ఈ రోజు వ్యాక్సిన్ ను తీసుకోలేదు.
దీనిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్ ప్రాణాలకు తెగించి డాక్టర్లు ,నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేసి, ప్రజల ప్రాణాలకు రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నారని, కొందరు ఆరోగ్య సిబ్బంది ప్రాణాలను సైతం త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని ఆదేశాల మేరకే ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా టీకాలు
ఇదే సమయంలో ఆరోగ్య కార్యకర్తలకు ముందు వ్యాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారని, అందుకే మొదటి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు ఇచ్చామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను ఈ రోజు వ్యాక్సిన్ తీసుకోలేక పోవడానికి కారణం అదేనని ప్రకటించారు. ప్రజలు అనవసర భయాలు పెట్టుకోవద్దని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ రావటం దేశానికి శుభ పరిణామం అని పేర్కొన్నారు తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ .

టీకాలపై భయాందోళన వద్దన్న ఈటెల రాజేందర్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, ఇక రియాక్షన్లు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా ఎలాంటి రియాక్షన్ వచ్చిన వైద్య చికిత్సలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటినుంచి వ్యాక్సిన్ పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు.