ఓట్లే ముఖ్యం, సంక్షేమం పట్టదు, బీజేపీపై మంత్రి హరీశ్ రావు నిప్పులు.. గ్రేటర్ ఎన్నికలపై నిర్దేశం
గ్రేటర్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి పాగా వేయాలని టీఆర్ఎస్ భావిస్తోండగా.. చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, మజ్లీస్ కూడా తమ వ్యుహాలకు మరింత పదును పెట్టాయి. షెడ్యూల్ ఒకటి, రెండురోజుల్లో విడుదల అవుతుందని అనుకుంటుండగా నేతల హడావిడి నెలకొంది. శ్రేణులతో సమావేశాలు/ ప్రచారంపై ఫోకస్ చేశాయి. మంత్రి హరీశ్ రావు పటాన్ చెరులో గల జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో టీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
మక్కలను కొనుగోలు చేస్తాం, పత్తికి కూడా మద్దతు ధర, అందుకు కారణం కేంద్రమే: హరీశ్ రావు

ఓట్లే ముఖ్యం..
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్యెల్సీలు భూపాల్ రెడ్డి, ఫరీదుద్దీన్ పాల్గొనగా.. శ్రేణులకు ఎన్నికపై నిర్దేశం చేశారు హరీశ్ రావు. బీజేపీ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ పార్టీకి ఓట్లే ముఖ్యం అని.. ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. బీజేపీ అంటే సిద్ధాంతల పార్టీ కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయందన్నారు. ఓట్ల కోసం చిల్లర మల్లర రాజకీయాలు చేస్తుందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేసే ప్రతీ పనిని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు.

ఇంటిపన్నులో 50 శాతం మినహాయింపు..
కరోనా వైరస్ వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇంటి పన్నులో 50 శాతం మినహాయింపును ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసిన పనిని కార్యకర్తలు ఇంటి ఇంటికీ వెళ్లి మరీ చెప్పాలని కోరారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించడంతోపాటు బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను విమర్శించడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు. వారు చేసే కామెంట్లను జనం గమనిస్తున్నారని తెలిపారు.

తాగునీటి కోసం రూ.250 కోట్లు..
పఠాన్‌చెరు, ఆర్సీపురం, భారతీ నగర్ డివిజన్లలో ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకోసం రూ.250 కోట్లు వెచ్చించామని చెప్పారు. పఠాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది తమ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పవర్ హాలి డేతో పరిశ్రమలు మూత పడ్డాయని గుర్తుచేశారు. స్థానిక యువత ఉపాధి కోసం ఐటీ, మెడికల్ సంస్థలను నెలకొల్పామని వివరించారు. పఠాన్‌చెరు, ఆర్సీపురంలో కొత్తగా మార్కెట్లు ఏర్పాటు చేశామని.. అన్ని వర్గాల ప్రజల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిర్మించిన 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 10 శాతం స్థానికులకు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

ఇంచార్జీల నియామకం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో మూడు డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జీలను నియమించింది. 111వ డివిజన్ భారతి నగర్‌కు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, 112వ డివిజన్ రామచంద్రాపురానికి అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, 113వ డివిజన్ పటాన్ చెరుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇంఛార్జీలుగా నియమితులయ్యారు.