మతం కాదు జనహితం ముఖ్యం... ఉద్వేగం కాదు ఉద్యోగాలు ముఖ్యం : గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్
మన పిల్లలు బయటకు వెళ్తే... తిరిగి ప్రశాంతంగా ఇల్లు చేరే హైదరాబాద్ కావాలా... లేక ఎక్కడ కర్ఫ్యూలో చిక్కుకుపోయాడా అని ఆందోళన చెందే హైదరాబాద్ కావాలా అని మంత్రి కేటీఆర్ నగర ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. మతం కాదు జనహితం ముఖ్యం... ఉద్వేగం కాదు ఉద్యోగాలు ముఖ్యమని హితవు పలికారు. ప్రతిపక్ష నేత మాటలకు ఆగమాగం కావద్దన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ది గురించి మాట్లాడండి... భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పండని బీజేపీని అడిగితే... బాబర్,బిన్‌లాడెన్‌ల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆరున్నరేళ్ల పాలనలో హైదరాబాద్‌కు ఏం చేశామో ప్రజలు ముందు రిపోర్ట్ పెట్టామని... ఒకవేళ తాము తప్పు చేస్తే ప్రజలే శిక్ష విధిస్తారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో నిర్వహించిన 'హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్' కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు,భవన నిర్మాణ యాజమాన్యాలు,వ్యాపారస్తులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రేటర్ మేనిఫెస్టో: వరద బాధితులకు రూ.50వేలు..మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు

ఆనాటి సీన్...
ఆరున్నరేళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతోమంది అనేక సందేహాలు వెలిబుచ్చారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆంధ్రా గొడవలు తలెత్తుతాయని.. ఉన్న పెట్టుబడిదారులే పారిపోతారని.. ఇలా ఏవేవో మాట్లాడారని గుర్తుచేశారు. కానీ ఈనాడు హైదరాబాద్ సుస్థిర పాలనలో అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందన్నారు. 2013,2014 సమయంలో వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ఉండేదని... వ్యాపారులు జనరేటర్లు,ఇన్వర్టర్లపై ఆధారపడేవారని గుర్తుచేశారు. జ్యూస్ సెంటర్ నడుపుకునే వ్యక్తి సైతం ఇన్వర్టర్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. విద్యుత్ సమస్య తీర్చాలని ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్‌లో వ్యాపారులు నిత్యం ధర్నాలు చేస్తుండేవారని గుర్తుచేశారు.

ఇప్పటి సీన్...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2014లో కాచిగూడలో స్టీల్ ట్రేడర్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో రెండు హామీలు ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. 'ఆ సమావేశంలో పాల్గొన్న వ్యాపారులు... ఏదైనా చేయండి.. మాకు మాత్రం విద్యుత్ ఇవ్వండి... సుస్థిర పాలన అందించండని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ సహా రాష్ట్రంలో 24గంటల విద్యుత్ అందుబాటులో ఉంది. అలాగే ఈ ఆరున్నరేళ్లలో రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది. ఎక్కడా కర్ఫ్యూ విధించిన దాఖలా లేదు.' అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరున్నరేళ్ల పాలనలో ఎక్కడా ఏ వ్యాపారిని ప్రభుత్వం వేధించిన దాఖలా లేదన్నారు. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా అందరినీ ప్రభుత్వం అక్కున చేర్చుకుందన్నారు.

కేంద్రం వైఫల్యం...
కేంద్ర ప్రభుత్వ పాలనలో లాక్డౌన్ కన్నా ముందే వరుసగా 8 త్రైమాసికాలు జీడీపీ క్షీణించిందన్నారు. నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి... వరుసగా జీడీపీ క్షీణిస్తూ వస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో వైఫల్యం చెందిన కేంద్రం... దానికి కరోనా సాకు చెబుతోందన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించి.. ప్రతీ జన్ ధన్ ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ఎవరికి అందిందో అర్థం కావట్లేదన్నారు.

నగరం నలుమూలలా అభివృద్ది...
తాను స్కూల్‌కి వెళ్లే రోజుల్లో.. చెప్పులు కొనుక్కోవాలంటే ఒక్క అబిడ్స్‌లోనే షాపింగ్ మాల్స్ ఉండేవన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో అన్ని వైపులా షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నారు. పశ్చిమాన కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని వికేంద్రీకరించాలన్న లక్ష్యంతో గ్రిడ్(గ్రోత్ ఇన్ డిస్పర్షన్) పాలసీ తీసుకొచ్చామన్నారు. ఈ విధానంతో నగరంలో అన్ని వైపులా ఐటీ విస్తరణకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇప్పటికే ఉప్పల్‌లో ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేశామని...వచ్చే రెండేళ్లలో కొంపల్లిలోనూ ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పాతబస్తీ పరిధిలోని పహాడీ షరీఫ్ వెనకాల కూడా పలు కంపెనీలు ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఈరోజు హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటిల్‌గా నిలిచిందని... ప్రపంచంలో తయారయ్యే మూడో వంతు వ్యాక్సిన్‌లో ఒక వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతోందని చెప్పారు.