GHMC elections 2020: గూగుల్ పే , ఫోన్ పే ల ద్వారా ఒక్కో ఓటుకు 5 వేలు ..ఎన్నికల్లో ధన ప్రవాహం
గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. జిహెచ్ఎంసి ఎన్నికలలో ఇప్పుడు ప్రలోభాల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది . ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీసిన నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీ లో డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా టెక్నాలజీ ని వినియోగించి నగదు పంపిణీ చేస్తున్నారు.
గ్రేటర్ లో కమలవ్యూహం ... రేపు హైదరాబాద్కు అమిత్ షా… నేరుగా చార్మినార్ వద్దకే

ఒక్కో ఓటుకు ఐదు వేలు .. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డిపాజిట్
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంచుతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపిస్తోంది.
ఒక్కో ఓటుకు ఐదు వేల చొప్పున గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పంపిస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు రాజకీయ పార్టీల నేతలు . జగద్గిరిగుట్టలో ఓ నేత ఓటర్ల ఎకౌంట్లో డబ్బులు వేయటం , వేశామని మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలలో నగదు పంపిణీపై ఆసక్తిని కలిగిస్తుంది . పలు చోట్ల రాజకీయ పార్టీలు డబ్బులు పంచే క్రమంలో ప్రత్యర్ధి పార్టీలు పట్టుకోవటం , అక్కడ ఘర్షణలు జరగటం చోటు చేసుకుంటుంది .

డిజిటల్ పద్దతిలో ఎవరికీ దొరక్కుండా ఓటర్లకు నగదు బదిలీ
ఈ సమయంలో డిజిటల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా ఓటర్లకు డబ్బులు చేరుతున్నాయి . ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికలు బిజెపి జాతీయ నేతలు రంగప్రవేశం చేయడంతో, జాతీయ స్థాయిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు.
ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు విచ్చలవిడిగా డబ్బును, మద్యాన్ని పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు.

వేలాదిగా అకౌంట్స్ నుండి పార్టీల ఎన్నికల డబ్బు పంపిణీ వ్యవస్థ
ఇక డబ్బుల పంపిణీ లో ఆన్లైన్ ద్వారా తమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్స్ ఫర్ అయితే అనుమానం వస్తుందన్న నేపథ్యంలో వేలాదిగా ఉన్న కార్యకర్తల ఖాతాల నుంచి ఎవరు పట్టుకోలేని విధంగా నగదు బదిలీ జరుగుతోంది. ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయలను గ్రేటర్ హైదరాబాద్ లో ఇస్తున్నారంటే ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎలా చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకుండా .. నేరుగా ఖాతాలోకే డబ్బులు ... ఇదో ఎన్నికల వ్యూహం
డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో నేతలు రూటు మార్చారు. ఇప్పటికే పలుచోట్ల డైరెక్టుగా నగదు పంపిణీ చేసే క్రమంలో దొరికి పోతున్న పరిస్థితుల కారణంగా ఓటర్ స్లిప్ చూసి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు .అంతేకాదు తమ పార్టీ నుండి డబ్బులు పంపామని , తమకు ఓటు వేయాలంటూ కోరుతున్నారు. ఓట్ల కోసం అభ్యర్థులు ఆన్లైన్ మార్గాన్ని ఎంచుకోవడం ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఆసక్తిగా మారింది.
ఈ విధానంలో ఈసీకి దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న నేతలు ఈ వ్యూహాన్ని అమలు చెయ్యటానికి తగిన వనరులను ఏర్పాటు చేసుకున్నారు.