కర్ఫ్యూ లేదు, లాక్ డౌన్ కూడా.. కరోనా నేపథ్యంలో మంత్రి ఈటల
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గ్రామాలు అయితే స్వయంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. దీంతో లాక్ డౌన్ ఉంటుందా..? ప్రభుత్వం విధిస్తోందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రలో కర్ఫ్యూ ఉండదు, ఉండబోదు అని చెప్పారు. అలాగే లాక్ డౌన్ విధించే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.

ఇటు ర్యాపిడ్ టెస్టులతో వెంటనే వైరస్‌కు సంబంధించిన రిజల్ట్ వస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ట్రేసింగ్ ఈజీ అయిందని, టెస్టుల సంఖ్య లక్ష వరకు పెంచాలని భావిస్తున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రెండు వేలకు చేరువలో రోజు వారీ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,734కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 11,617 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,634 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 393 కరోనా కేసులు నమోదయ్యాయి.