నో మాస్క్.. నో ఓట్, 14 లక్షల విలువగల వస్తువులు సీజ్, కోటిన్నర నగదు కూడా...
కరోనా వైరస్ ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే స్ప్రెడ్ అవుతోంది. కేసులు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. అయితే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రికాషన్స్ తీసుకుంటూనే.. ఓటు వేసే ప్రతీ ఒక్క వయోజనులు విధిగా మాస్క్ ధరించాలని స్పష్టంచేశారు. మాస్క్ లేకుంటే ఓటు వేసేందుకు అనుమతించబోమని ఈసీ వర్గాలు స్పష్టంచేశాయి. ఈసీ కూడా నో మాస్క్.. నో ఓటు అనే నినాదం ఇస్తోంది.
గ్రేటర్ పోలింగ్: అణువణువు దుర్భేద్యం, 52 వేల మంది పోలీసులతో భద్రత

మాస్క్, శానిటైజర్..
పోలింగ్ కేంద్రాల వద్ద మాస్క్, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రెండో దశ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేస్తారు. ఓటు వేసే సమయంలో ఓటర్ మాస్క్ తొలగించాలి. ఆ సమయంలో మొహన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు చూపించాలి. అందులో ఉన్న ఫోటో, నిజమా కాదా అని చెక్ చేస్తారు. లేదంటే దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద విధిగా భౌతిక దూరం పాటించాలని స్పష్టంచేశారు.

పీపీఈ కిట్ కూడా..
పోలింగ్ సిబ్బందికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్, గ్లౌస్, ఫేస్ షీల్డు, శానిటైజర్‌తోపాటు పీపీఈ కిట్ కూడా సిబ్బందికి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 9101 పోలింగ్ కేంద్రాల్లో 36 వేల మందికిపైగా విధులు నిర్వహిస్తారు. వీరందరికీ సరిపడా మెటీరియల్ అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో పోలింగ్ అధికారులు, సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుందని చెప్పారు.

కేసులు, ఫిర్యాదులు
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి 99 ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 100 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలించిన వస్తువులను కూడా సీజ్ చేశారు. సరైన ధ్రువపత్రం సమర్పించకపోవడంతో రూ.14 లక్షల 68 వేల 941 విలువగల వస్తువులను సీజ్ చేశారు. నగదు కూడా భారీగానే పట్టుబడింది. రూ.1 కోటి 46 లక్షల 37 వేల 180 నగదును సీజ్ చేశారు. పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున 500 ఎంఎల్ శానిటైజర్లను అందజేస్తారు. మొత్తం 60 వేల శానిటైజర్ సీసాలను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచుతారు.

అతి సమస్యాత్మక కేంద్రాలు
ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 చొప్పున లక్ష 20 వేల కొవిడ్-19 కిట్ ఉంచుతారు. 19 మంది హెల్త్ నోడల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. 1729 సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. 5 వేల 95 మంది వీడియో గ్రఫీ టీంలు ఉంటారు. 2277 వెబ్‌కాస్టింగ్.. 661 జోనల్/రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు 30 ఉంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ 60 మంది ఉంటారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 279 ఉండగా.. ఇందులో అతి సున్నిత పోలింగ్ కేంద్రాలు 1,207 ఉన్నాయి. సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 2,336 ఉన్నాయి.