జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరు గెలిచినా సరే .. సెలబ్రేట్ చేసుకునేది బీజేపీనే .. రీజన్ ఇదే !!
జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎవరు విజయం సాధించినా , బీజేపీ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈరోజు కౌంటింగ్ ప్రారంభం నుంచి బిజెపి మంచి జోష్ లో ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులకు అభినందనలతో ట్వీట్స్ చేస్తున్నారు.
గత జిహెచ్ఎంసి ఎన్నికలలో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగి కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అయిన బీజేపీ, ఈసారి అనూహ్యంగా రెండింతల స్థానాలను దక్కించుకుంది. .

నాలుగు స్థానాల నుండి నలభై స్థానాల దాకా బీజేపీ ప్రయాణం
గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన ఇప్పుడు 40 స్థానాల వరకూ సాధిస్తామని బిజెపి నేతలు ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నిజంగా బీజేపీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని నింపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని సవాలు చేస్తూ, అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బిజెపి ఇప్పుడు స్థిరపడింది. ఈ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ పై జెండా ఎగురవేయలేకపోయినా, కనీసం 2023 లో, బిజెపి 15 ఎంపీ స్థానాలను దక్కించుకుని, తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడం పక్కా అని బిజెపి నేతలు ధీమాతో ఉన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగిన బీజేపీ
వచ్చే ఎన్నికలు ఏవైనా సరే, బిజెపి గట్టిపోటీ ఇస్తుందని తేల్చి చెబుతున్నారు.
ఈసారి ఎన్నికలలో బిజెపి జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేసినప్పటికీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఘోరంగా వెనుకబడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఇంతకాలం చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బిజెపి కొట్టిన దెబ్బతో కుదేలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ లోకి బిజెపి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ సైతం జీర్ణించుకోలేకపోతోంది.

బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ .. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం .. మోడీ ఫోన్ కాల్
తెలంగాణ రాష్ట్రం పై బిజెపి అధినాయకత్వం దృష్టిసారించడం, తమ ప్రణాళికలకు తెలంగాణ ముఖ్యమని భావించే అన్ని సంకేతాలను పార్టీ నాయకత్వం పంపడం పట్ల బిజెపి శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేసి గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలపై మాట్లాడడం, తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇది బీజేపీ శ్రేణుల్లో ధైర్యాన్ని, బిజెపి నాయకత్వంలో ఒక భరోసా నింపి పార్టీని ముందుకు నడిపించింది.

గట్టి పోటీ ఇవ్వటంలో బీజేపీ సక్సెస్ ..
దక్షిణాదిలో పాగా వేయాలని నిర్ణయం తీసుకున్న బిజెపి కర్ణాటక రాష్ట్రం తర్వాత, దక్షిణాన తెలంగాణ రాష్ట్రంపై పట్టు సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించి ప్రత్యామ్నాయం లేని బలమైన రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఊహించని విధంగా బిజెపి ఇచ్చిన గట్టిపోటీ కి టిఆర్ఎస్ పార్టీ నేతలకు చెమటలు పట్టాయి
. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓకే ఓకే ఎమ్మెల్యే స్థానాన్ని గెలుపొందింది. ఇక తాజాగా దుబ్బాక ఉపఎన్నిక ఫలితంతో అసెంబ్లీలో బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలను పంపించినట్లు అయింది.

భవిష్యత్ ఎన్నికల కదనోత్సాహం .. అందుకే బీజేపీ సెలబ్రేషన్స్
ఇటీవల నాగార్జునసాగర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన కారణంగా, అక్కడ కూడా ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి నాగార్జునసాగర్ నియోజకవర్గం పై దృష్టి సారించే అవకాశం ఉంది అంతేకాదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ, రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలలోనూ టిఆర్ఎస్ పార్టీ కి చుక్కలు చూపించడానికి బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది బిజెపి. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన జోష్ బిజెపి నేతలను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కదనోత్సాహం తో ముందుకు సాగేలా కమల దండు రెడీ అవుతోంది.