పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని సంబురపడ్డారు. తీరా కొలువులో చేరాక గానీ తిప్పలు తెలియడం లేదు. ఎలాంటి శిక్షణ లేకుండా నియమించిన పంచాయతీ కార్యదర్శుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం చాలా పోస్టులకు పరీక్షలు నిర్వహించినా కొన్నింటి ఫలితాలు విడుదల చేయలేదు. మరికొన్నేమో పెండింగులో ఉన్నాయి.
ఆ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినా తెల్లారే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు ప్రకటించడంతో ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే సరైన శిక్షణ లేకుండా డైరెక్టుగా పోస్టులు కేటాయించడంతో ఇప్పుడు క్షేత్ర స్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్యోగం చేస్తున్నా.. కంటిమీద కునుకు లేక..!
తెలంగాణలో ప్రభుత్వ కొలువులపై ఓ క్లారిటీ లేని తరుణంలో.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టడంతో హర్షం వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికలు (ఏప్రిల్ 11) ముగిసిన రోజే అర్ధరాత్రి అర్హుల జాబితా ప్రకటించడం చర్చానీయాంశమైంది. అయితే ఉద్యోగాలు వచ్చాయని సంబరపడ్డ అభ్యర్థులకు ఇప్పుడు చేదు అనుభవం ఎదురవుతోంది.
టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి తెచ్చింది. అనంతరం పంచాయతీలకు ఎన్నికలు కూడా నిర్వహించింది. అయితే అంతకుముందే పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ విడుదల చేసి టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించింది. అయితే వరుస ఎన్నికల క్రమంతో కోడ్ అమలయినందున కొద్దిరోజులు ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ పెండింగ్‌లో పెట్టింది.
హమ్మ కిలాడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!

ఆగమేఘాల మీద ఉద్యోగం.. క్షేత్రస్థాయిలో ఇబ్బందుల పర్వం
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రోజే అనూహ్యంగా పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఎంపికైన అర్హుల జాబితా విడుదల చేసింది ప్రభుత్వం. ఆ మేరకు ఎలాంటి శిక్షణ లేకుండానే మరునాడు (ఏప్రిల్ 12) వారు డ్యూటీల్లో చేరిపోయారు. అయితే కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై కొందరికి అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధి నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో తిప్పలు పడుతున్నారు కొందరు పంచాయతీ కార్యదర్శులు.
కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామంలోని ప్రతి పనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శే బాధ్యత వహించాలి. అది కూడా ఆన్లైన్ ద్వారానే పూర్తి చేయాల్సి ఉంది. దాంతో చాలాచోట్ల కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస శిక్షణ లేకుండా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడంతో తికమక పడుతున్న సందర్భాలున్నాయి.

కొత్త చట్టం.. పుట్టెడు కష్టాలు
కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పనితీరును ప్రతినెల సంబంధిత వెబ్సైట్లో పొందుపర్చాలి. లే అవుట్లు, భవన నిర్మాణాలు అనుమతుల కోసం పంచాయతీలకు అనుసంధానంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆ సాఫ్ట్ వేర్ కూడా ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరింది. గ్రామాల్లో ఉపాధి హామీతో పాటు జనన, మరణాల నమోదు.. ఇతర విషయాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయానికి పంచాయతీ కార్యదర్శే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విధులు సరిగా నిర్వహించని కార్యదర్శులపై చర్యలు తీసుకునేలా కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో చేర్చారు. వారిని తొలగించేందుకు స్పెషల్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వామ్మో ఎన్నెన్ని కష్టాలో.. ఏదైనా బాధ్యత కార్యదర్శిదే..!
ఇదివరకు రెండు మూడు పంచాయతీలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండేవారు. నూతన ప్రభుత్వ విధానాలతో ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి నియమితులయ్యారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలు కొత్తగా కొలువులో చేరినవారికి ఇబ్బందిగా మారాయి. సరైన అవగాహన లేక, శిక్షణ పొందలేక సతమతమవుతున్నారు.
చెక్ పవర్ విషయంలో కూడా పంచాయతీ కార్యదర్శులకు కాస్తా ఇబ్బందికర పరిణామమే. ఇదివరకు సర్పంచ్, కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. దాంతో ఆడిట్ విషయంలో కార్యదర్శికి ఎలాంటి తలనొప్పులు ఉండేవి కావు. సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పుడు సర్పంచుకు, ఉపసర్పంచుకు చెక్ పవర్ ఇచ్చేసరికి కార్యదర్శులకు తిప్పలు తప్పవేమో. అయితే నిధుల వినియోగానికి సంబంధించిన ఆడిట్ మాత్రం సర్పంచుతో పాటు కార్యదర్శులే చేయాల్సి ఉంటుంది. అందులో ఏమైనా పొరపాట్లు జరిగితే కార్యదర్శులే బాధ్యత వహించాల్సి రావడం గమనార్హం.
ప్రాజెక్టుల పేరిట నాటకాలొద్దు.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

పేరుకే ఉద్యోగం.. కడుపు నిండని వైనం
ఇక పంచాయతీ కార్యదర్శులకు వేతనాల్లోనూ తీరని వెతలే. కొలువుదీరి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు జీతాల ఊసే లేదు. మొత్తానికి గ్రామ పాలన వారికి తలకు మించిన భారంలా మారింది. ఆగమేఘాల మీద ప్రభుత్వం ఉద్యోగావకాశం కల్పించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం వారికి పుట్టెడు కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. ట్రెజరీలో ఇంటి పన్నులు, ఇతరత్రా ఆదాయ వనరులు జమ అవుతున్నా.. కార్యదర్శులకు చెక్ పవర్ లేక అవి మూలుగుతున్నాయి. దాంతో గ్రామాభివృద్ధి విషయంలోనూ వారు ఏమిచేయలేని పరిస్థితి. మరోవైపు బాధ్యతలు సరిగా నిర్వర్తించుకుంటే ఉద్యోగం ఊస్టే అనే సంకేతాలు వారిని మరింత టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.