తహశీల్దార్ విజయారెడ్డి లాగే హతమార్చుతా: ప్రభుత్వ భూమి పట్టా కోసం బెదిరించిన పురుషోత్తం అరెస్ట్
పురుషోత్తం.. అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. కానీ ఆ పేరు పెట్టుకున్న ఇతడు మాత్రం ఉత్తముడు కాదు అదముడు. అబద్దాలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. అడ్డొచ్చిన అధికారులను బెదిరిస్తున్నాడు. ఇదివరకు పలువురు రాజకీయ నేతలు, పోలీసులను కూడా బెదిరించినట్టు విచారణలో వెల్లడించాడు. ఎల్బీనగర్లో ఘరానా మోసగాడు పురుషోత్తంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంక్వైరీలో భాగంగా కీలక సమాచారం సేకరించారు.

రాజకీయ నేత అని..
పురుషోత్తం స్వస్థలం వనపర్తి జిల్లా వెంకటంపల్లి. తాను రాజకీయ నేతను అని పరిచయం చేసుకుంటాడు. అలా పరిచయం పెంచుకొని.. పనుల కోసమని వచ్చి.. దబాయించి మరీ కోట్లు కూడబెట్టాడు. ప్రధానంగా భూ కబ్జాలు చేసి సెటిల్ మెంట్ల ద్వారా భారీగా డబ్బులు సమకూర్చాడు. ఇతని లీలలు ఒకటి కాదు రెండు కాదు.. తహశీల్దార్‌ను కూడా బెదిరించాడు.

తహశీల్దార్‌కు హుకుం..
ప్రభుత్వ భూమిపై పురుషోత్తం కన్నుపడింది. ఇంకేముంది తన పేరుతో పట్టా చేయమని తహశీల్దార్‌ను సంప్రదించాడు. అందుకు శ్రీనివాస్ రెడ్డి అనే తహశీల్దార్ అంగీకరించలేదు. ఇంకేముంది తన రౌడీయిజాన్ని బయటపెట్టాడు. భూమి రిజిష్ట్రేషన్ చేస్తావా లేదా అని బెదిరించాడు. లేదంటే తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించాడు. దానిని తహశీల్దార్ లైట్ తీసుకోవడంతో.. ఇంటిపై పెట్రోల్ బాటిల్‌తో విసిరి సంచలనం సృష్టించాడు.

పొలిటిషీయన్స్‌కు..
తహశీల్దారే కాదు.. ఇదివరకు ల్యాండ్ సెటిల్మెంట విషయంలో రాజకీయ నేతలను కూడా బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ అధికారులనే కాదు అడ్డొచ్చిన పోలీసులను కూడా వదలలేదని విచారణలో పోలీసులకు తెలిపాడు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. అతడిని పక్కా ప్రణాళిక ప్రకారం పట్టుకొన్నాయి.