GHMC Elections 2020 Results Ghmc Elections 2020 greater hyderabad revanth reddy congress party defeat media reason publicity trs bjp fight congress democracy గ్రేటర్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమి మీడియా కారణం ప్రచారం టీఆర్ఎస్ బీజేపీ పోరాటం కాంగ్రెస్ ప్రజాస్వామ్యం politics
కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్యాకేజ్ ఇవ్వనందుకేనా ఇలా .. రేవంత్ రెడ్డి ధ్వజం
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కారణం మీడియానే అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. మీడియా ప్యాకేజీ ఇచ్చిన వారికే ప్రచారం చేసిందని, నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీడియానే ప్యాకేజీల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హోరాహోరీ పోరులో బీజేపీ విజయాల నమోదు .. ఇప్పటివరకు 24 స్థానాల్లో కమలవికాసం

కావాలనే టీఆర్ఎస్ , బీజేపీల మధ్య పోటీ అంటూ మీడియా ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీడియా చాలా విచిత్రంగా ప్రవర్తించింది అని సామాజిక బాధ్యతతో ప్రవర్తించాల్సిన మీడియా, ఆ విధంగా ప్రవర్తించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కావాలని టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నట్లుగా చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పెద్దగా చూపించలేదని, మీడియా చిత్రీకరణ వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందంటూ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఉద్రిక్తతలను రెచ్చగొడితే పదే పదే అదే చూపించటంలో ఆంతర్యం అర్ధం కాలేదన్నారు .

మత విద్వేషాలు రెచ్చగొడితే అవే వార్తలా మేమూ అలా చెయ్యల్సిందా ? రేవంత్ ప్రశ్న
శుక్రవారం రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళడం పై ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మీడియా అత్యుత్సాహం చూపించిందని, ఇక బుర్ర తక్కువ టిఆర్ఎస్ నేతలు బండి సంజయ్ అన్న అడ్డుకుంటామంటూ తిరగడం ద్వారా రాజకీయ పార్టీలు విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూశాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక ఆ తరహా చర్యలకు తాము కూడా దిగితే మీడియా బాగా ప్రచారం చేస్తుందా అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు వెళ్తే మీడియా తన విపరీత పోకడలతో వాస్తావాలను ప్రసారం చెయ్యలేదన్నారు .

కాంగ్రెస్ వార్తలు ఏదో ఒక చిన్న కార్నర్ లో .. ఎలాంటి ప్రాధాన్యత లేనట్టుగా
ఇక వార్తాపత్రికల్లో అన్నింటిని టిఆర్ఎస్ పార్టీ నాయకులకు బిజెపి నాయకులకు కేటాయించిన తర్వాత, ఎక్కడో ఓ మూల, కనిపించీ కనిపించని ఒక చిన్న బాక్స్ లో ఏదో యాడ్ రాసినట్టు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియానే ప్యాకేజీ తీసుకొని పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణం .. గ్రేటర్ ఎన్నికల్లో మీడియా రోల్ బాగాలేదు
గ్రేటర్ లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమంటూ ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించ లేదని ఆరోపించారు . టీఆర్ఎస్ బీజేపీలు మీడియాని ప్యాకేజీలతో మేనేజ్ చేశాయని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక బిజెపి కోసం ప్రధాని నుండి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరకు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో నాలుగో స్థంభం అయిన మీడియా ఇలా ప్రజాస్వామ్య వినాశనానికి కారణం అవుతుందని అనుకోలేదని తాను చాలా ఆవేదనలో మాట్లాడుతున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి .

కార్యకర్తల ప్రయత్నం లోపం లేదు ... కష్ట కాలంలో జెండా మోసిన కార్యకర్తలకు అభినందనలు
కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను అభినందించిన రేవంత్ రెడ్డి అనేక దుష్ట శక్తుల కుయుక్తులను ఎదుర్కొని, ఆర్థిక, అంగబలాలను దీటుగా తట్టుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రశ్నించే గొంతులను గెలిపించడంకోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. ఓటమిలో వారి ప్రయత్నలోపం ఏదీ లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలను రేవంత్ అభినందించారు.