రేవంత్ డుమ్మా: కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశానికి గైర్హాజరు.. కారణం ఇదేనా..?
టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపినట్టయ్యింది. సాగర్ ఎన్నిక నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోన్న మీటింగ్‌కు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించినట్టు సమాచారం. సమావేశానికి ఎంపీ రేవంత్‌రెడ్డి మాత్రం హాజరు కాలేదు.
ఎన్నికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఆయన లేఖ ద్వారా పంపారు. ఎమ్మెల్సీగా కూన శ్రీశైలం గౌడ్‌ను బరిలోకి దింపాలని లేఖలో రేవంత్‌రెడ్డి తెలిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, హర్షవర్ధన్‌రెడ్డి, ఇందిరా శోభన్‌తో సహా 18 మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అభ్యర్థి ఎంపికపై చర్చించి మూడు పేర్లను అధిష్టానానికి పీసీసీ పంపనుంది. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ పాల్గొన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఫిబ్రవరి చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. అందరికంటే ముందుగా ఆ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి... ఎన్నికలకు సమాయత్తమవుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, వరంగల్, నల్గొండ, ఖమ్మం సెగ్మెంట్ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డిని ప్రకటించారు. ఈ సెగ్మెంట్ నుంచే జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అధినేత కోదండరాం బరిలో ఉన్నారు. అయితే అధికార పార్టీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం.