సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేపోలీసుల అదుపులో 8వాట్సప్ గ్రూప్స్ అడ్మిన్లు; విచారణలో ఆవుల సుబ్బారావు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ కొనసాగిన ఆందోళనలలో భాగంగా చోటుచేసుకున్న విధ్వంసంలో వాట్సాప్ గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని గుర్తించిన సిట్, రైల్వే పోలీసులు ఈ మేరకు ఎనిమిది వాట్సాప్ గ్రూప్ ల అడ్మిన్ లను అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటన
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఈనెల 17వ తేదీన విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే యువకుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. పలువురు రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు. ఇక రైల్వే కు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఆందోళనకారులు అటు రైల్వే పోలీసులపై కూడా రాళ్లతో దాడికి దిగడంతో రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ విధ్వంసంలో వాట్సప్ గ్రూపులది కీలక పాత్ర
ఇక ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న రైల్వే పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా ఘటనకు బాధ్యులను గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. ఇక ఈ కేసులో మరో 150 మందిని గుర్తించామని చెప్పిన రైల్వే పోలీసులు, వారిని అరెస్ట్ చేయడానికి రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఈ కేసుని త్వరితగతిన విచారణ చేయడం కోసం రైల్వే సిట్ కు కేసును బదలాయించడం జరిగింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఈ విధ్వంసం వెనుక వాట్సప్ గ్రూపులు కీలక పాత్ర పోషించాయని గుర్తించారు.

వాట్సప్ గ్రూప్ ల అడ్మిన్ లను అరెస్ట్ చేసిన రైల్వే సిట్
రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్స్, చలో సికింద్రాబాద్, ఏఆర్ఓ3 గ్రూపు, ఆర్మీ జీడి 2021 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్ గ్రూప్, సోల్జర్స్ టుడై గ్రూప్ ద్వారా పెద్ద ఎత్తున రెచ్చగొట్టేలా, దాడులకు పాల్పడేలా చర్చలు జరిగాయని సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ గ్రూపుల అడ్మిన్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం పది గ్రూపులు అభ్యర్థులను రెచ్చగొట్టడంలో కీలకంగా వ్యవహరించాయని గుర్తించిన నేపథ్యంలో, ఆయా గ్రూప్ ల అడ్మిన్ లను రైల్వే సిట్ అధికారులు విచారణ జరపనున్నారు.

ఆవుల సుబ్బారావును విచారిస్తున్న రైల్వే సిట్ బృందం
ఇదిలా ఉంటే ఈ కేసులో వాట్సప్ గ్రూపుల ద్వారా ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టడానికి ఓ ప్రైవేటు డిఫెన్స్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవులు సుబ్బారావును తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆయనను హైదరాబాద్ కు తీసుకువచ్చి రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇక ఆవుల సుబ్బారావును రైల్వే సిట్ బృందం ఈరోజు విచారణ జరుపుతుంది.