కన్న కూతుళ్లనే చెరబట్టిన తండ్రి... ఏళ్ల తరబడి అత్యాచారం... హైదరాబాద్లో వెలుగుచూసిన దారుణం..
దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. పసిపిల్లలు,వృద్దులు అన్న తేడా లేకుండా కామాంధులు స్త్రీలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఆఖరికి సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా మహిళలకు రక్షణ కరువవుతోంది. కడుపున పుట్టిన బిడ్డ అన్న కనీస మానవత్వం కూడా లేకుండా పోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కన్న కూతుళ్ల పైనే తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.

ఇదీ జరిగింది...
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని బోలానగర్ ఫస్ట్లాన్సర్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి(42) కామాంధుడిగా మారాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 18 ఏళ్ల తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక గతేడాది డిసెంబర్ 29న బాధిత యువతి ఇంట్లో నుంచి పారిపోయింది.కుటుంబ సభ్యులు,బంధువులు ఆమె కోసం గాలించగా ఎట్టకేలకు ఈ నెల 5న ఆమె ఆచూకీ దొరకడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

ఇలా బయటపడింది...
ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయావని ఆమెను ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. మహమ్మద్ కరీం అనే వ్యక్తి తనను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అంతేకాదు,ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తన సోదరిపై కూడా తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని వాపోయింది. కుటుంబ సభ్యుల సహకారంతో బంజారాహిల్స్ పోలీసులకు తండ్రిపై ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హర్యానాలోనూ ఇదే తరహా ఘటన..
రెండు రోజుల క్రితం హర్యానాలోనే హిసార్ పట్టణంలోనూ ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. తన పెద్ద కుమార్తె పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆ నీచపు తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఏడేళ్ల పాటు బాలికకు ప్రత్యక్ష నరకం చూపించాడు. ప్రస్తుతం 17ఏళ్ల వయసున్న ఆ బాలికకు ఇప్పటికే పదుల సార్లు అబార్షన్లు చేయించాడు. అంతేకాదు,కొన్నాళ్లుగా 11 ఏళ్ల తన చిన్న కూతురిపై కూడా అతను లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల పెద్ద కూతురు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది.