గ్రేటర్ పోలింగ్‌లో ఘర్షణలు: పరస్పర దాడులు, స్లిప్‌ల పంపిణీ, దొంగ ఓట్లు వేసే యత్నం..
గ్రేటర్లో జరుగుతోన్న పోలింగ్‌లో ఆడపా దడపా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీ శ్రేణుల మధ్య గొడవలు జరిగాయి. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు వారిని చెదరగొట్టడంతో.. పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది.
గ్రేటర్ పోలింగ్: చైతన్యపురిలో ఉద్రిక్తత, టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల డిష్యూం డిష్యూం..

డిష్యూం.. డిష్యూం...
పటాన్చెరు డివిజన్లోని చైతన్య స్కూల్ దగ్గర టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్త విష్ణు దాడి చేశాడని బీజేపీ అభ్యర్థి ఆశిష్‌గౌడ్ ఆరోపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.

ఫోటోతో కూడిన స్లిప్ పంపిణీ..
భారతీనగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఫొటోతో కూడిన స్లిప్‌ల పంపిణీ చేస్తుండటంతో బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంజిరెడ్డి ఆరోపిస్తున్నారు.

గుర్తు తారుమారు.. రేపు పోలింగ్..
ఓల్డ్‌మలక్‌పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్ధి గర్తు తారుమారైంది. దీనిపై సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. సీపీఐ గుర్తు కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి నక్షత్రం ఎన్నికల అధికారులు ముద్రించారు. ఈ ఘోర తప్పిదాన్ని సీపీఐ నాయకులు తప్పుపట్టారు. డివిజన్ ఎన్నికలు రద్దుచేసి మరోసారి తప్పిదాలు లేకుండా నిర్వహించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేయగా.. అందుకు ఈసీ అంగీకరించింది. రేపు పోలింగ్ నిర్వహించనుంది.

దొంగ ఓట్లు వేసే యత్నం..
మన్సూరాబాద్ డివిజన్ (12) సహారా ఎస్టేట్‌లో పరిగి నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. యాకుత్‌పురాలో ఆటోల్లో వచ్చిన కొందరు మహిళలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. ఎంబీటీ నాయకులు వారిని గుర్తించారు. అంతలో అక్కడికొచ్చిన పోలీసులకు అప్పగించారు.

రంగంలోకి పోలీసులు
పఠాన్‌చేరు 113 డివిజన్ చైతన్య నగర్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి.. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి అక్కడినుంచి పంపించేశారు.