ఆస్తి కోసం, రైతుబంధు డబ్బుల కోసం కొడుకు ఘాతుకం .. నిద్రిస్తున్న తండ్రిని బండరాయితో మోది ఆపై ..
మానవత్వం మంటగలిసి పోతుంది. రాక్షసత్వం రాజ్యమేలుతుంది. రక్త సంబంధాలు కూడా మరిచిపోయి తల్లిదండ్రుల పాలిట కాలయములుగా మారుతున్నారు పిల్లలు . ఆస్తి కోసం పేగు బంధాన్ని మరచిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి ఘాతుకమే వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆస్తి కోసం, రైతుబంధు డబ్బులు కోసం ఓ కొడుకు కన్న తండ్రినే హతమార్చాడు. నిద్రిస్తున్న కన్నతండ్రిని అతి కిరాతకంగా బండరాయితో మోది మరీ చంపాడు.

తండ్రిని రైతు బంధు డబ్బుల కోసం వేధించిన తనయుడు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంఖుర్దు గ్రామానికి చెందిన చింతల రుస్తుం అనే వ్యక్తికి పదిహేనేళ్ల క్రితం భార్య చనిపోయింది. ప్రస్తుతం తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
రుస్తుం పెద్ద కుమారుడు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు. డబ్బుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఇటీవల రైతుబంధు డబ్బులు రావడంతో ఆ డబ్బులు తనకు ఇవ్వాలంటూ తండ్రిని వేధింపులకు గురి చేశాడు.
కేబుల్ టీవీ టెక్నీషియన్ గా వెళ్లి .. యూపీలో డెంటిస్ట్ నిషా సింఘాల్ దారుణ హత్య, ఆపై చోరీ

డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన తండ్రితో కొడుకు ఘర్షణ .. ఆపై హత్య
డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిని, ఆస్తిలో వాటా పంచమంటూ ఘర్షణకు దిగాడు కుమారుడు. ఆస్తి పంచటానికి కూడా తండ్రి నిరాకరించాడు. ఈ క్రమంలో ఆస్తి పంచను అన్నాడని, రైతుబంధు డబ్బులు ఇవ్వనని అన్నాడని రుస్తుం వరి పంటకు కాపలాగా రాత్రి వేళ పొలం వద్ద నిద్రిస్తున్న సమయంలో తండ్రి తలపై బండరాయితో మోది హత్య చేశాడు పెద్దకొడుకు శేఖర్. అనంతరం తనకేమీ తెలియదన్నట్టు ఇంటికెళ్ళి నిద్రపోయాడు.
సోమవారం తెల్లవారుజామున చుట్టుపక్కలవారు రుస్తుం హత్య గావించబడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు .

జాగిలాలకు చిక్కిన కొడుకు .. పోలీస్ విచారణలో విషయం వెలుగులోకి
పోలీసులు ఆధారాల సేకరణలో భాగంగా డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు . దీంతో నేరుగా జాగిలాలు శేఖర్ వద్దకు వెళ్లి అతని చొక్కా పట్టుకున్నాయి. పోలీసులు శేఖర్ ని అదుపులోకి తీసుకొని విచారణ జరపటంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు శేఖర్. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొడుకు శేఖర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
చిన్నప్పటినుంచీ అల్లారుముద్దుగా పెంచిన పిల్లలు, పెద్దయ్యాక విచక్షణ మరచి, డబ్బు కోసం మానవ మృగాలు గా మారడం నిజంగా శోచనీయం. రక్త సంబంధాలకు, అనుబంధాలకు, మానవతా విలువలకు అర్థం మరిచిపోతున్న నేటి రోజుల్లో ఇలాంటి దారుణాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు తల్లిదండ్రులకు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది.