రెండోస్సారి.. స్పీకర్ పోచారంకు కరోనా.. పరీక్ష చేయించుకోవాలని..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇద్దరు టీఆర్ఎస్ నేతలకు కరోనా సోకింది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా వైరస్ రెండోసారి సోకింది. రెండు నెలల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.
స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ఎలాంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరారు. గత కొంత కాలంగా తనను కలిసిన వారితో పాటు సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకుని, తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇటు ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కూడా కరోనా బారిన పడ్డారు. స్పల్ప లక్షణాలతో బాధపడుతూ ఉండగా పరీక్షలు చేయగా, పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. తనను వారం రోజులుగా కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో నిన్న 1,963 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులు గుర్తించారు. శనివారం 53వేల 073 మందికి కరోనా పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్నాయి. పండగ సమయంలో జనం గ్రామాలకు వెళుతున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్కూల్స్ రీ ఓపెన్‌పై తెలంగాణ సర్కార్ పునరాలోచనలో పడింది. సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడగించింది. ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే స్కూళ్లకు సర్కార్ సెలవులు ప్రకటించగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వాటిని లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇష్టారాజ్యంగా స్కూల్స్, కాలేజీలు నడిపేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.