కొండెక్కిన టమాట.. సిటీలో కిలో రూ.100.. ఏపీలో కూడా..
అసలే వేసవి.. ఆపై వేడి.. ఇంకేముంది కాయకూరలు, ఆకుకూరలకు గిరాకీ కాస్త ఎక్కువే. మొన్నటి వరకు టమాట ధర తక్కువే ఉండేది. కానీ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు మూడు నెలల కింద డిమాండ్ అంతగా లేదు. ఇప్పుడు కిలో రూ.100 వరకు చేరింది. రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్కెట్లలో మంచి టమాటాలు కిలో రూ.80 పలుకుతుంటే చిన్న మార్కెట్లలో వంద పలుకుతుంది.
ఎండలు, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. టమాట దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. జంట నగరాల్లో గల మెండా మార్కెట్, బోయిపల్లి వంటి హోల్సేల్ మార్కెట్లతోపాటు మెహదీపట్నం, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఎల్బినగర్, వనస్థలిపురం వంటి ప్రధాన రైతు బజార్లలో కూడా టమాట కొరత ఏర్పడింది.

అంతకుముందు సిటీ 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుండే. ఇప్పుడు రోజుకు 50 లారీల రావడం కూడా కష్టమైంది. హొల్ సేల్ మార్కెట్లోనే కిలో టమాట రూ.50 నుంచి 55 పలుకుతోండగా.. మార్కెట్లలో రూ.80 నుండి రూ.100 పలుకుతుంది. ఏపీలో కూడా టమాటా ధరలు కొండెక్కాయి. పెద్ద మార్కెట్ మదనపల్లెలో కిలో టమాటా రూ.60కి చేరింది. మూడు నెలలగా ఎండలవేడితో టమాటా దిగుబడి భారీగా పడిపోయింది.
వేసవిలో కురిసిన భారీ వర్షాలతో కాస్త పంటా దెబ్బతింది. తెలుగు రాష్ట్రాలలో టమాటాకు డిమాండ్ ఏర్పడింది. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు నుంచి దిగుమతి చేసుకోవడంతో ధర అమాంతం పెరిగింది. పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పోగా.. చికెన్ ధరలు తక్కువేమీ కాదు. ఇప్పుడు పోటీగా టమాటా వచ్చి కూర్చొంది. ఇక పప్పు ధరలు చెప్పక్కర్లేదు. మంచి నూనె కూడా లీటర్ రూ.200 వరకు పలుకుతుంది. దీంతో ఏమీ కొనాలి.. ఏం తినాలి అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.