టార్గెట్ హైదరాబాద్ అంటున్న కేంద్రం... దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు నిర్ణయంతో టెన్షన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి అమలు చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కసరత్తు జరిపిన కేంద్ర సర్కార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశ పౌరులు ఎవరో, అక్రమ వలసదారులు ఎవరో తేల్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ రిజిస్టర్ ను నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.దీంతో హైదరాబాద్ లో అక్రమ వలసదారులకు భయం పట్టుకుంది.'

దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆర్టికల్ 370 రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయాలని నిర్ణయంతో కేంద్రం ముందుకు వెళ్లబోతోంది. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అయితే హైదరాబాద్ టార్గెట్ గానే అమిత్ షా ఈ ప్రకటన చేశారనే చర్చ జోరుగా సాగుతుంది.

హైదరాబాద్ కేంద్రంగా అక్రమ వలసదారులు ఉన్నారన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్... హైదరాబాద్ కేంద్రంగా అక్రమ వలసదారులు చాలామంది ఉన్నారని, దేశంలో ఎక్కడ ఏం జరిగినా దానికి సంబంధించిన మూలాలు హైదరాబాదులో ఉంటాయని చాలా కాలంగా బిజెపి నేతలు చెబుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని, వివిధ దేశాల నుండి వచ్చి హైదరాబాద్ లో చాలా మంది జీవిస్తున్నారని, వారు పలు ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటున్నారు అని, కచ్చితంగా వారందర్నీ ఏరి వేస్తామని ప్రకటించారు.

దేశం ధర్మసత్రం కాదని గతంలోనే వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
కేంద్ర హోం శాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజులలోనే ఆయన దేశంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. భారత దేశం ధర్మ సత్రం కాదన్నారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్ గా ఉందని కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుండి వచ్చి ఓల్డ్ సిటీ లో చాలా మంది అక్రమంగా ఉంటున్నారని వారిపై చర్య తీసుకుంటామని చెప్పారు.

హైదరాబాద్ టెర్రరిస్ట్ లకు సేఫ్ జోన్ అనే భావన
హైదరాబాద్ టెర్రరిస్ట్ లకు సేఫ్ జోన్ గా మారిందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ ఉగ్ర దాడులు జరిగినా మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు సహకరించేవారిని శాశ్వతంగా ఏరేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు . నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారీపై ప్రధానంగా దృష్టి సారించినట్టు చెప్పారు. ఇక ఇప్పుడు అదే దేశ వ్యాప్తంగా అమలు చేయ్యనున్నట్టు అమిత్ షా ప్రకటించారు.

మయన్మార్ నుండి వచ్చిన రోహింగ్యాలకు హైదరాబాద్ స్థావరం
ఇక అంతే కాకుండా మయన్మార్ నుంచి తరిమివేయబడ్డ ఆ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు. కానీ రోహింగ్యాలు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ముంబై, మే వాట్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో దాదాపుగా 40 వేల మంది ఉన్నట్లుగా కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదికలు ఇచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో శరణార్ధులుగా ఉన్న రోహింగ్యాల కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిఘా కూడా పెట్టారు.

హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు
ఇక అంతే కాకుండా బంగ్లాదేశ్ కు సంబంధించి, ఆఫ్రికా దేశాలకు సంబంధించి చాలామంది హైదరాబాద్ లో అక్రమంగా తలదాచుకుంటున్నారు. ఇక వీరందరిపై ఎన్ఆర్సి ద్వారా ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది కేంద్ర సర్కార్ . హైదరాబాద్ అక్రమ వలసదారులకు అడ్డాగా మారిందని పేర్కొన్న మంత్రి కిషన్ రెడ్డి కాశ్మీర్ తర్వాత హైదరాబాద్ లోనే ఎక్కువ మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని తెలిపారు.

ఆధార్ కార్డులు సైతం తీసుకున్న అక్రమ వలసదారులు .. కేంద్రం తాజా నిర్ణయంతో టెన్షన్
అంతర్జాతీయ సరిహద్దు ఉన్న కశ్మీర్,అసోం వంటి రాష్ట్రాలకు ఇతర దేశాల వారు వచ్చే అవకాశం ఉంటుంది కానీ దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ రోహింగ్యాలకు ఎలా స్థావరంగా మారిందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు అక్రమ వలసదారులు చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులను సైతం తీసుకున్నారని, వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారు అన్నది తేలాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం ఫోకస్ హైదరాబాద్ పై ఉండడంతో, కేంద్రం తాజా నిర్ణయం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడం కేంద్ర టార్గెట్ హైదరాబాద్ అనే విషయం కచ్చితంగా అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులు టెన్షన్ లో పడ్డారు. వారికి సపోర్ట్ చేసేవారు కూడా ఆందోళనలో పడ్డారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!