కాంగ్రెస్ గ్రేటర్ మేనిఫెస్టో: వరద బాధితులకు రూ.50వేలు..మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని భారీగానే తాయిలాలు ప్రకటించింది. ప్రధానంగా వరద బాధితులకు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు,వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు ఇస్తామన్నారు.
వరదల సమయంలో విపత్తు నిర్వహణకు జపాన్, హాంకాంగ్, స్పెయిన్ దేశాల్లో అవలంభిస్తున్న విధానాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌ను వరదరహిత నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి ఠాగూర్,ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో...
వరద బాధితులకు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం
వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా
ఆరోగ్య శ్రీ పరిధిలోకి కోవిడ్ 19 చికిత్స, బస్తీ దవాఖానాలు 450కి పెంపు, ప్రతి 100 ఆస్పత్రులకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి
మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ.
కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ. 150 డివిజన్లలో రీడింగ్ రూమ్‌లు, ఈ- లైబ్రరీలు. దివ్యాంగులకు లైబ్రేరియన్ ఉద్యోగాలు
అర్హత కలిగిన పేదలకు డబుల్ బెడ్రూ ఇళ్లు, ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.8లక్షలు. సింగల్ బెడ్ రూమ్ఉంటే మరో గది నిర్మాణానికి రూ.4లక్షల సాయం. వారు అద్దె ఇంట్లో ఉండేందుకు రూ.60,000 సాయం
రూ.50,000 వరకు ఆస్తిపన్ను రాయితీ. డబుల్ బెడ్రూం ఇళ్లకు, మురికివాడల్లో ఇళ్లకు ఆస్తిపన్ను రద్దు
జీహెచ్ఎంసీలో 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి రాయితీ
లాక్ డౌన్ కాలానికి ఆస్తిపన్ను, మోటారు వాహనాల పన్ను, విద్యుత్ బిల్లులు రద్దు. ఇప్పటికే బిల్లులు చెల్లిస్తే తర్వాత బిల్లుల్లో సర్దుబాటు
80 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉంటే ఆస్తిపన్ను రద్దు
క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మలు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ. అన్ని అనుమతులు ఫ్రీ.
మాజీ సైనిక ఉద్యోగులు, ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్య (వితంతువులు), అవయవాలు కోల్పోయిన సైనికులకు ఆస్తిపన్నులో 75 శాతం రాయితీ
ఎలాంటి చార్జీలు లేకుండానే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలుకు కృషి. ధరణి పోర్టల్ రద్దుకు కృషి
30,000 లీటర్ల వరకు ఉచిత మంచినీరు, ఉచితంగా నల్లా కనెక్షన్
కోవిడ్ 19తో దెబ్బతిన్న వర్గాలకు నిరుద్యోగ అలవెన్సులు
ఏడాదిలో మూసీ నదుల ప్రక్షాళన, మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు.
2021 నాటికి సమగ్రమైన సీవరేజ్ వ్యవస్థ, 2022 నాటికి చెత్తరహిత హైదరాబాద్.
సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.25లక్షల బీమా నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్లు పెంపు