తెలంగాణ గడ్డ మీద అడుగిడిన జరీన్.. ఘన స్వాగతం పలికిన మంత్రులు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ స్వదేశం చేరుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. విజయం సాధించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన నిఖత్ జరీన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అధికారులు వెల్ కం చెప్పారు.

ఘన స్వాగతం..
శుక్రవారం సాయంత్రం ఆమె బయటకు రాగానే పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్‌కు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆమెకు పూల బొకే ఇచ్చి స్వాగతించారు. క్రీడాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని, వాటి సహకారంతో నేడు నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అయిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత వారందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు.

శుభాకాంక్షలు
మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రుల త్యాగం, ప్రభుత్వ సహకారం, అకుంఠిత పట్టుదల వల్లనే నిఖత్ జరీన్ ఇంత గొప్ప విజయం సాధించిందని కొనియాడారు. నిజామాబాద్‌కే చెందిన షూటర్ ఇషా సింగ్ కూడా షూటింగ్లో పతకాలు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎంత సపోర్ట్ ఇస్తుందో ఈ విజయాలే చెప్తున్నాయని అన్నారు.

థాంక్స్.. కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జరీన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రోత్సాహం అందించిన సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని వివరించారు. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్నానని వివరించారు. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో కూడా రాణిస్తానని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని కామెంట్ చేశారు.